నీటి ఆవిరిని ఒడిసిపట్టేస్తుంది!
కారణాలు ఏవైనా కావొచ్చు.. ప్రస్తుతం నీటి కొరత ప్రపంచాన్ని పీడిస్తోంది. తాగునీటి కొరతను తగ్గించేందుకు నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరానికి చెందిన సన్గ్లేషియర్స్ అనే సంస్థ.. 20 అంగుళాలున్న వాటర్ క్యూబ్‌ను తయారు చేసింది. పక్కన ఫొటోలో చూపిన క్యూబ్ మీ దగ్గరుంటే చాలు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొంతు తడుపుకునేందుకు కావాల్సినన్ని నీళ్లు దొరుకుతాయి.
ఇది గాలిలోని తేమను నీరుగా మారుస్తుంది. క్యూబ్‌పై ఏర్పాటు చేసిన సౌర శక్తి ఘటకాలు 40 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తే, అందులో 25 వాట్లను వాడుకుని లోపలి వైపున కనిపించే స్టీల్ శంఖు చల్లబడుతుంది. చుట్టుపక్కల నీటి ఆవిరి.. సంక్షేపణం (కన్డెన్సేషన్) అనే ప్రక్రియకు గురై బిందువులుగా మారుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కిందపడే నీటిని మనం తాగొచ్చు. ఒక్కో పరికరంతో ఎంత మోతాదులో నీరు ఉత్పత్తి చేయవచ్చన్నది గాలిలో ఉండే తేమ శాతంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ విద్యుత్తుతో రిఫ్రిజిరేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడం దీని ప్రత్యేకతని వాటర్ క్యూబ్‌ను రూపొందించిన ఆప్వెర్ హెగ్గెన్ అంటున్నారు.