Sania Mirza and martina Hingis
-
సానియా జోడీ జైత్రయాత్రకు బ్రేక్
దోహా: ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్ వన్ జోడీ చరిత్రకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఓటమితో మహిళల డబుల్స్ లో 41 వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్ లో సానియా మిర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) 2-6, 6-4, 10-5 తేడాతో రష్యా ద్వయం ఎలినా వెస్నినా- డారియా కసాట్కినా చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 13 టోర్నమెంట్లలో ఓటమనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్-స్విస్ జోడీకి పెద్ద షాక్ తగిలింది. 1994 తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు(28) గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్న సానియా-హింగిస్ ద్వయం, 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించే క్రమంలో కేవలం కొన్ని అడుగులదూరంలో(41 విజయాలు) వెనుదిరిగారు. దీంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ లో అత్యధిక వరుస విజయాల రికార్డులో మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. కాగా, మహిళల డబుల్స్‌లో ప్రపంచ రికార్డు లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983- 85 మధ్య కాలంలో మార్టినా నవ్రతిలోవా-ఫామ్ ష్రివర్‌లు వరుసగా 109 మ్యాచ్‌ల్లో నెగ్గడం ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. -
సెమీస్‌లో సానియా జోడి
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 7-6 (5), 6-4తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్)పై నెగ్గారు. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ ద్వయం స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి ఇప్పటికే ఏడు ట్రోఫీలను ఈ జోడి సొంతం చేసుకుంది. -
సానియా జంట శుభారంభం
ఫ్యామిలీ సర్కిల్ కప్ చార్ల్స్టన్ (అమెరికా) : వరుసగా రెండు టైటిల్స్‌తో జోరు మీదున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-హింగిస్ ద్వయం 6-7 (7/9), 6-3, 10-5తో అనస్తాసియా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. జోడీగా కలిసి ఆడుతున్న తర్వాత సానియా-హింగిస్ జంట తొలిసారి తమ ప్రత్యర్థి జోడీకి ఓ సెట్‌ను కోల్పోయింది. ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్లలో ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా టైటిల్స్ సొంతం చేసుకున్న వీరిద్దరికి ఈసారి గట్టిపోటీనే ఎదురైంది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో సెట్లో తేరుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గి వరుసగా 11వ విజయాన్ని ఖాయం చేసుకుంది. ఒకవేళ ఫ్యామిలీ సర్కిల్ కప్‌లోనూ విజేతగా నిలిస్తే సానియా మీర్జా డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. ‘ఈ టోర్నీలో మా పార్శ్వంలోని ‘డ్రా’ కఠినంగా ఉంది. ఇతరులతో పోలిస్తే మేము ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే క్లే కోర్టులపై జరుగుతున్న ఈ టోర్నీలో ఆడుతున్నాం. మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాం. తొలి సెట్‌ను నెగ్గాల్సింది. అయితేనేం తొలిసారి సూపర్ టైబ్రేక్‌లో విజయాన్ని దక్కించుకున్నాం’ అని మ్యాచ్ అనంతరం సానియా వ్యాఖ్యానించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అనాబెల్ మెదీనా (స్పెయిన్)-ష్వెదోవా (కజకిస్థాన్) జంటతో సానియా జోడీ తలపడుతుంది.