sanjay deshmukh
-
ఎలుకల వేట... ఔట్ సోర్సింగ్!
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఇప్పుడో పెద్దచిక్కు వచ్చిపడింది. శివారు కాలనీల్లో ఎలుకలు విజృభిస్తున్నాయట. కార్పొరేటర్లు, జనం నుంచి ఒకటే ఫిర్యాదులు. ప్రధాన నగరంలో ఎలుకలు పట్టడానికి... చంపడానికి దాదాపు 154 మంది సిబ్బంది బీఎంసీకి ఉన్నారు. ఫుల్‌టైమ్ కార్మికుడికి నెలకు 5,000 రూపాయలు బీఎంసీ చెల్లిస్తోంది. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 30 ఎలుకలు చంపాలనేది టార్గెట్. 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి కాలంలో వీరు మొత్తం 2.6 లక్షల ఎలుకలు చంపారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే శివార్లలో ఇలాంటి యంత్రాగం లేకపోవడంతో ఎలుకలను చంపేపనిని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు అదనపు మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీలకు ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే సాధారణ జనంలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎలుకల వేటకు ముందుకు వస్తే వారికి వారం రోజుల పాటు ఎలుకలను పట్టి చంపడంలో శిక్షణ ఇస్తామని కూడా ఆయన వెల్లడించారు. -
అలంకారప్రాయంగా ట్రామా కేర్ సెంటర్
సాక్షి, ముంబై: కోట్ల రూపాయల ప్రజాధన్మంతో ఎంతో భారీగా నిర్మించి, ఆర్భాటంగా ప్రారంభించిన ట్రామా కేర్ సెంటర్ సరైన సదుపాయాలు లేక వెలవెలబోతోంది. రూ.134 కోట్ల వ్యయంతో 13 అంతస్తులు నిర్మించిన ట్రామా కేర్ సెంటర్‌ను గత అక్టోబర్‌లో ప్రారంభించిన సంగతి తెల్సిందే. అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ట్రామా కేర్‌లో రోగులు ఎలాంటి చికిత్సకు నోచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆస్పత్రికి బీఎంసీకి చెందిన ఇంప్రూవ్మెంట్ కమిటీ సదుపాయాలను సమకూర్చాల్సి ఉంది. కానీ కనీసం ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రా ల ఏర్పాటుకు అనుమతి కూడా ఇవ్వలేకపోయింది. ఆస్పత్రి నిర్మాణ సమయంలోనే దీనిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెప్పుకున్నారు. అందుకు తగినట్లు స్పెషలిస్టు డాక్టర్లను నియమించేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఉన్న వైద్య సిబ్బంది కూడా అరకొరగా ఉన్నారు. ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణులు, సరైన పరికరాలు లేకపోవడంతో ఇక్కడికి వచ్చే రోగులను శస్త్ర చికిత్సల కోసం తప్పనిసరిగా ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోందని ఇక్కడ పని చేసే ఓ వైద్యుడు చెప్పారు. వివిధ వైద్య విభాగాలలో వైద్యుల కొరత ఉందని అన్నారు. ఆస్పత్రిని ప్రారంభించి ఎనిమిది నెలలు దాటిపోయినా ఇంతవరకు స్పెషలిస్టులను నియమించలేదని అన్నారు. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాలకు గురైన బాధితుల ప్రాణాలను నిలబెట్టడానికి ఇక్కడ సర్జన్, న్యూరో సర్జన్ల అవసరం ఉంటుందని ఆ డాక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బ్లడ్ బ్యాంక్ కూడా కాగితాలకే పరిమితమైంది. కానీ ఆస్పత్రిని చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దినప్పటికీ ఎలాంటి సదుపాయాలు సమకూర్చ లేదు. ఇక్కడ 104 మంది రోగులకు వైద్యం అందించేందుకు బెడ్లు ఉన్నాయి. కానీ అన్నీ ఖాళీగానే పడి ఉన్నాయి. ఆస్పత్రి ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూ 20 శాతానికి మించి రోగులు చేరలేదని ఆ డాక్టర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, 104 పడకలకు గాను కేవలం 30 మంది నర్సులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.అడిషినల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. త్వరలోనే స్పెషలిస్టు వైద్యులను కూడా నియమిస్తామన్నారు. -
నర్సు పోస్టులు భర్తీ ప్రక్రియలో స్వల్పమార్పులు
సాక్షి, ముంబై: బీఎంసీ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో పరిపాలనా విభాగం స్వల్ప మార్పులు చేసింది. ఈ ఉద్యోగాల్లో ఇక నుంచి బీఎంసీకి చెందిన ‘నర్సింగ్ స్కూల్’ లో శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించింది. 90 శాతం ఉద్యోగాలు నర్సింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి, 10 శాతం బయట శిక్షణ పొందిన వారికి కేటాయించనున్నారు. నర్సింగ్ సేవలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో బీఎంసీ... ఓ నర్సింగ్ పాఠశాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ శిక్షణ పొందిన వారికి అనేక సంవత్సరాలుగా భర్తీ ప్రక్రియలో ప్రాధాన్యమిస్తోంది. అయితే రిజర్వేషన్ కోటా కింద కొన్ని కులాలకు చెందిన నర్సులు దొరక్కపోవడంతో బయట శిక్షణ పొందిన వారిని భర్తీ చేయాల్సి వస్తోంది. గత సంవత్సరం 334 మంది నర్సులను భర్తీ చేయాలంటే ఇంటర్వ్యూకి ఆహ్వానించాల్సి వచ్చింది. 2005, జూలై 26న నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు సేవలందించేందుకు నర్సుల కొరత సమస్య ఎదురైంది. ఆ సమయంలో బీఎంసీకి చెందిన నర్సులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చిన సుమారు 50 మంది న ర్సులు వైద్యసేవలు అందించారు. వారి సేవలను రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రశంసించింది. దీంతో గత సంవత్సరం జరిగిన భర్తీ ప్రక్రియలో వారికి ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది. అయితే ఇలా భర్తీ చేయడాన్ని బీఎంసీ నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందిన నర్సులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరితోపాటు పలు కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే సంవత్సరం నుంచి నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందినవారిని ఈ ఉద్యోగాల్లో నియమిస్తామని హామీ ఇచ్చికూడా పరిపాలనావిభాగం అన్యాయం చే స్తోందంటూ కార్మిక సంఘాలు ఆరోపించాయి. అయితే ఈ ఏడాది భర్తీ ప్రక్రియ జరగనుందని తెలియడంతో సంఘాల నాయకులు ఇటీవల బీఎంసీ అదనపు కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్‌ను కలిశారు. బీఎంసీ నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందిన నర్సులకే ప్రాధాన్యమివ్వాలని పట్టుబట్టారు. వీరి డిమాండ్ సమంజసంగా ఉండడంతో అందుకు అంగీకరించారు. ఆ ప్రకారం 90 శాతం మందిని పాఠశాలనుంచి, మిగతా పది శాతం మంది బయట నుంచి భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.