ఎలుకల వేట... ఔట్ సోర్సింగ్!
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఇప్పుడో పెద్దచిక్కు వచ్చిపడింది. శివారు కాలనీల్లో ఎలుకలు విజృభిస్తున్నాయట. కార్పొరేటర్లు, జనం నుంచి ఒకటే ఫిర్యాదులు. ప్రధాన నగరంలో ఎలుకలు పట్టడానికి... చంపడానికి దాదాపు 154 మంది సిబ్బంది బీఎంసీకి ఉన్నారు. ఫుల్‌టైమ్ కార్మికుడికి నెలకు 5,000 రూపాయలు బీఎంసీ చెల్లిస్తోంది. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 30 ఎలుకలు చంపాలనేది టార్గెట్. 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి కాలంలో వీరు మొత్తం 2.6 లక్షల ఎలుకలు చంపారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అయితే శివార్లలో ఇలాంటి యంత్రాగం లేకపోవడంతో ఎలుకలను చంపేపనిని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు అదనపు మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీలకు ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే సాధారణ జనంలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎలుకల వేటకు ముందుకు వస్తే వారికి వారం రోజుల పాటు ఎలుకలను పట్టి చంపడంలో శిక్షణ ఇస్తామని కూడా ఆయన వెల్లడించారు.