సాక్షి, ముంబై: బీఎంసీ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో పరిపాలనా విభాగం స్వల్ప మార్పులు చేసింది. ఈ ఉద్యోగాల్లో ఇక నుంచి బీఎంసీకి చెందిన ‘నర్సింగ్ స్కూల్’ లో శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించింది. 90 శాతం ఉద్యోగాలు నర్సింగ్ స్కూల్‌లో శిక్షణ పొందిన వారికి, 10 శాతం బయట శిక్షణ పొందిన వారికి కేటాయించనున్నారు. నర్సింగ్ సేవలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో బీఎంసీ... ఓ నర్సింగ్ పాఠశాలను ఏర్పాటుచేసింది.
ఇక్కడ శిక్షణ పొందిన వారికి అనేక సంవత్సరాలుగా భర్తీ ప్రక్రియలో ప్రాధాన్యమిస్తోంది. అయితే రిజర్వేషన్ కోటా కింద కొన్ని కులాలకు చెందిన నర్సులు దొరక్కపోవడంతో బయట శిక్షణ పొందిన వారిని భర్తీ చేయాల్సి వస్తోంది. గత సంవత్సరం 334 మంది నర్సులను భర్తీ చేయాలంటే ఇంటర్వ్యూకి ఆహ్వానించాల్సి వచ్చింది. 2005, జూలై 26న నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు సేవలందించేందుకు నర్సుల కొరత సమస్య ఎదురైంది. ఆ సమయంలో బీఎంసీకి చెందిన నర్సులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చిన సుమారు 50 మంది న ర్సులు వైద్యసేవలు అందించారు. వారి సేవలను రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రశంసించింది. దీంతో గత సంవత్సరం జరిగిన భర్తీ ప్రక్రియలో వారికి ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది.
అయితే ఇలా భర్తీ చేయడాన్ని బీఎంసీ నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందిన నర్సులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరితోపాటు పలు కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే సంవత్సరం నుంచి నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందినవారిని ఈ ఉద్యోగాల్లో నియమిస్తామని హామీ ఇచ్చికూడా పరిపాలనావిభాగం అన్యాయం చే స్తోందంటూ కార్మిక సంఘాలు ఆరోపించాయి. అయితే ఈ ఏడాది భర్తీ ప్రక్రియ జరగనుందని తెలియడంతో సంఘాల నాయకులు ఇటీవల బీఎంసీ అదనపు కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్‌ను కలిశారు. బీఎంసీ నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందిన నర్సులకే ప్రాధాన్యమివ్వాలని పట్టుబట్టారు. వీరి డిమాండ్ సమంజసంగా ఉండడంతో అందుకు అంగీకరించారు. ఆ ప్రకారం 90 శాతం మందిని పాఠశాలనుంచి, మిగతా పది శాతం మంది బయట నుంచి భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
నర్సు పోస్టులు భర్తీ ప్రక్రియలో స్వల్పమార్పులు
Published Mon, Apr 28 2014 10:53 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement