Outsourcing agencies
-
ఎలుకల వేట... ఔట్ సోర్సింగ్!
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఇప్పుడో పెద్దచిక్కు వచ్చిపడింది. శివారు కాలనీల్లో ఎలుకలు విజృభిస్తున్నాయట. కార్పొరేటర్లు, జనం నుంచి ఒకటే ఫిర్యాదులు. ప్రధాన నగరంలో ఎలుకలు పట్టడానికి... చంపడానికి దాదాపు 154 మంది సిబ్బంది బీఎంసీకి ఉన్నారు. ఫుల్‌టైమ్ కార్మికుడికి నెలకు 5,000 రూపాయలు బీఎంసీ చెల్లిస్తోంది. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 30 ఎలుకలు చంపాలనేది టార్గెట్. 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి కాలంలో వీరు మొత్తం 2.6 లక్షల ఎలుకలు చంపారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే శివార్లలో ఇలాంటి యంత్రాగం లేకపోవడంతో ఎలుకలను చంపేపనిని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు అదనపు మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీలకు ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే సాధారణ జనంలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎలుకల వేటకు ముందుకు వస్తే వారికి వారం రోజుల పాటు ఎలుకలను పట్టి చంపడంలో శిక్షణ ఇస్తామని కూడా ఆయన వెల్లడించారు. -
‘వైద్య’ అక్రమార్కులపై వేటు
* ‘సాక్షి’ కథనంతో ప్రభుత్వం చర్యలు * రూ. 2 కోట్లు చేతులు మారినట్లు ఇంటెలిజెన్స్ నివేదికతో కదలిక * ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, ఎన్హెచ్ఎం ఏవో శ్రీనివాసరెడ్డిపై వేటు * బాధ్యతల నుంచి తొలగించిన సర్కారు * వైద్య మంత్రి పేషీలోని ఓఎస్డీలపైనా చర్య సాక్షి, హైదరాబాద్: ‘అంగట్లో డాక్టర్ పోస్టులు’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అందుకు కారకులైన నలుగురు ఉన్నతాధికారులపై గురువారం వేటుపడింది. సదరు ఏజెన్సీలకు అనుమతినిస్తూ అంతర్గత ఉత్తర్వులు ఇచ్చిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డెరైక్టర్ సాంబశివరావును బాధ్యతల నుంచి తొలగించింది. ఆ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సాంబశివరావును సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చినా ప్రభుత్వం ధ్రువీకరించలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిపాలనాధికారి(ఏవో) శ్రీనివాసరెడ్డినీ ఆ బాధ్యతల నుంచి తొలగించింది. వైద్య, పారామెడికల్ పోస్టులను అమ్ముకుంటున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే వైద్య మంత్రి రాజయ్య పేషీలోని ఓఎస్డీలు డాక్టర్ సంపత్, డాక్టర్ గంగాధర్‌ను కూడా బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిసింది. అయితే మంత్రి కార్యాలయవర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. ఎన్హెచ్ఎం మంజూరు చేసిన 1500 వైద్య సిబ్బంది పోస్టుల్లో నియామకాలు చేపట్టేందుకు కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు సాంబశివరావు అనుమతించారు. అయితే ఇందుకు ప్రభుత్వంలోని కీలక నేతతో పాటు కొందరు ఉన్నతాధికారులు సదరు ఏజెన్సీల నుంచి లంచం తీసుకున్నారన్న విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దీనిపై విచారణ జరిపిన నిఘా వర్గాలు.. రూ. రెండు కోట్లు చేతులు మారినట్లు స్పష్టం చేశాయి. ఈ నివేదిక ఆధారంగానే తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఓఎస్డీలు కూడా అతిగా వ్యవహరిస్తున్నారని, విభాగాధిపతులు, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వారిని తొలగించినట్లు సమాచారం. మార్గదర్శకాలు ఖరారు... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఔట్సోర్సింగ్ వైద్య, పారామెడికల్ పోస్టుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఆ ప్రకారం జిల్లా ఆరోగ్య సంస్థల(డీహెచ్సీ) ద్వారానే పోస్టులను నింపాలి. తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. అభ్యర్థి స్థానికుడై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్వ్యూలు నిర్వహించకూడదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరగాలి. ఇద్దరు అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులుంటే వారి పుట్టిన రోజును ఆధారం చేసుకోవాలి. పుట్టిన రోజులు కూడా ఒకే తేదీగా ఉంటే... వారి మండలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల అర్హతలు, వాటి అనుభవాన్ని ఆధారం చేసుకోవాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని డీహెచ్ఎస్ల నిపుణుల కమిటీ ఆ ఏజెన్సీలను ఆమోదించాలి. ఈ మార్గదర్శకాలను సీఎంకు పంపిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. సీఎం ఆమోదం లభించాక జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ జారీచేసి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నియామకం చేపడతారు. అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. -
‘అంగట్లో వైద్య పోస్టులు’ రద్దు!
‘సాక్షి’ కథనంపై స్పందించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘అంగట్లో డాక్టర్ పోస్టుల’ బాగోతానికి తెరపడింది. నిబంధనలను విరుద్ధంగా జరిగిన నియామకాలు నిలి చిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కన్నెర్రజేశారు. 1,500 వైద్య పోస్టులను ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకానికి బెట్టిన వైనాన్ని ‘అంగట్లో వైద్య పోస్టులు’ శీర్షికన ‘సాక్షి’ సోమవారం బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్లను సీఎం సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకుని దీనిపై నిల దీసినట్లు సమాచారం. ‘‘జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఆరోగ్య సంస్థలు భర్తీ చేయాల్సిన పోస్టులకు... ఇన్చార్జి కమిషనర్ ఉత్తర్వులెలా ఇచ్చారు?’’ అని సీఎం ప్రశ్నించారు.‘‘అవినీతిరహితులు, చక్కని అడ్మిని స్ట్రేటర్ అని నమ్మి మిమ్మల్ని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించాం. కానీ మీ శాఖ లో జరుగుతున్న అవినీతి నియమాకాలను చూసీచూడనట్లుగా వ్యవహరించారు. ఇది పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక. తొలిసారి అవినీతికి సంబంధించిన వార్త వచ్చింది’’ అని చందాను ఉద్దేశించి అన్నట్టు సమాచారం. ‘‘సదరు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయండి. ఇప్పటికే నియమాకాలు చేపడితే వాటిని రద్దు చేయండి. కొత్త మార్గదర్శకాలను రెండురోజుల్లో ఖరారు చేసి జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వండి’’ అని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు ఆగమేఘాల మీద ఆ పనిలో ఉన్నారు. ‘‘మెరిట్ ఆధారంగా, జిల్లా ఆరోగ్య సంస్థల ద్వారానే పోస్టులను భర్తీ చేయాలి. అర్హతలు, అనుభవాన్ని ఆధారంగా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను ఆమోదించాలి’’ అని తాజా మార్గదర్శ కాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వాటిని సీఎం ఆమోదించాక నోటిఫికేషన్ ఇస్తారు. ఔట్సోర్సింగ్ అక్రమాలపై సీఎం తక్షణం స్పందన పట్ల తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం నర్సింగ్, పారామెడికల్ సంఘం హర్షం వెలిబుచ్చాయి. -
సంపాదనకు ఇదో సోర్స్
స్వయంగా రాతపరీక్షలు నిర్వహించి మరీ బేరమాడుతున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అటెండర్ పోస్టు కావాలా..రూ.50వేలు ఇవ్వాల్సిందే... ఇంకొంచెం పెద్దదయితే..జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తారా... అయితే రూ.లక్షయినా ఇవ్వండి.. డబ్బులిస్తేనే ఉద్యోగం...ఔట్సోర్సింగ్ ద్వారా, ఏడాది ఉద్యోగమే అయినా సరే... కాసులు మాత్రం ముట్టజెప్పాల్సిందే... పైసలివ్వలేదంటే మీకు ఆ ఉద్యోగం చేసేందుకు అర్హత లేనట్టే... ఇదీ జిల్లాలో కొన్ని ప్రైవేటు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల తీరు. ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు ఈ ఏజెన్సీలు పండగ చేసుకుంటున్నాయి. నిరుద్యోగ యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని గ్యారంటీ లేని ఉద్యోగాలే అయినా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు తీసేసుకుని ఇచ్చేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల దందా నడుస్తోంది. ఈ కళాశాలల్లో బోధనేతర పోస్టులను భర్తీ చేసేందుకుగాను ఏకంగా రాతపరీక్షలే నిర్వహించిన ఏజెన్సీలు ఆ తర్వాత బేరసారాలు నడిపిస్తుండడం గమనార్హం. పోస్టుకో రేటు ఇటీవల జిల్లాలోని పలు డిగ్రీ కళాశాలల్లో అటెండర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, ఇతర టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. నకిరేకల్, ఆలేరు, చండూరులోని కళాశాలల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో 14 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే, జిల్లాలోని మూడు ఏజెన్సీలు ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులను పంపుతామని కాంట్రాక్టు పొందాయి. నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. వారికి హాల్‌టికెట్లు పంపి ఏకంగా రాతపరీక్ష కూడా నిర్వహించాయి. నల్లగొండలో జరిగిన ఈ రాతపరీక్షలకు 52మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ రాత పరీక్షల తర్వాత అసలు కథ ప్రారంభమైంది. ఫలితాలను వెల్లడించి మెరిట్లిస్టులు పెట్టకుండానే ఆ ఏజెన్సీలు కాసుల దందాకు దిగుతున్నట్టు తెలుస్తోంది. పోస్టుకో రేటును ఫిక్స్ చేసి డబ్బులిస్తేనే ఎంపిక చేస్తామని, లేదంటే ఏదో సాకు చెప్పి మెరిట్‌లిస్టులో పేరు తీసేస్తామని బేరమాడుతున్నట్టు సమాచారం. ఈ కోవలో ఓ ఏజెన్సీ బేరసారాలాడిన నిరుద్యోగి ఒకరు ఁసాక్షి*తో మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నారు. నాకు అన్ని అర్హతలున్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం పెట్టిన రాతపరీక్షలో నాకు మంచి మార్కులు వస్తాయి. అయినా రూ.లక్ష ఇస్తేనే ఉద్యోగం వస్తుందంటున్నారు. లేదంటే నా పేరు మెరిట్‌లిస్టులో పెట్టరంట. ఇదేం పద్ధతి.* అని వాపోవడం గమనార్హం. అదేవిధంగా అటెండర్, ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు రూ.50వేల వరకు బేరాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఉద్యోగాల వేతనాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రెగ్యులర్ పోస్టులో పనిచేసే ఉద్యోగికి ఉండే మూలవేతనం (బేసిక్)ను వారి నెల వేతనంగా నిర్ణయించడంతో రూ.6,700 నుంచి రూ.8500 వరకు మాత్రమే వారికి నెలసరి వేతనాలు వస్తున్నాయి. అయితే, ఈ ఉద్యోగాలను కొనసాగించే అవకాశం ఏజెన్సీలకు ఉండడంతో నిరుద్యోగులు పెద్దమొత్తంలో ఏజెన్సీ నిర్వాహకులకు డబ్బులు ముట్టజెపుతున్నారు. కళ్లకు కడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల దందా వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చే దగ్గరి నుంచి నియామకాలు పొందిన వారి నెల జీతం ఇచ్చేంతవరకు ప్రభుత్వం అన్ని బాధ్యతలను ఔట్సోర్సింగ్ ఏజెన్సీలమీదే పెడుతుండడంతో ఆ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరికీ కనిపించని రీతిలో నోటిఫికేషన్లు ఇస్తుండడంతో ఏజెన్సీలే ఫలానా పోస్టులున్నాయని, దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో పాటు ఉద్యోగాల్లో నియామకాలు పూర్తయిన తర్వాత వారి వేతనాలను కూడా ఏజెన్సీలకే చెక్కుల రూపంలో ఇస్తుండడంతో ఏజెన్సీల నిర్వాహకులు అప్పుడు కూడా కోత పెట్టి వేతనాలు ఇస్తున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. మరోవైపు ఉద్యోగుల పీఎఫ్ జమ చేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కేవలం ప్రభుత్వం, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల మధ్యే ఒప్పందం కుదరడం, ఆ తర్వాత కనీసం పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లోనూ సంప్రదించే అవకాశం లేకపోవడంతో ఉద్యోగాలు చేయాలన్నా ఏజెన్సీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోందని నిరుద్యోగులంటున్నారు. ఉద్యోగాల కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండడం, ఆ తర్వాత కొనసాగించాలన్నా ఏజెన్సీల అనుమతి కావాల్సి ఉండడంతో ఉద్యోగులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెన్సీల నిర్వాహకులను కూడా పల్లెత్తు మాట కూడా అనలేకపోతున్నారు. ఈ పద్ధతిలో ప్రభుత్వం తమకేం బాధ్యత లేదనే రీతిలో వ్యవహరిస్తుండడమే ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యానికి కారణమవుతోందనే భావన నిరుద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది.