సంపాదనకు ఇదో సోర్స్ | This is a source of earnings | Sakshi
Sakshi News home page

సంపాదనకు ఇదో సోర్స్

Published Sat, Jan 3 2015 4:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

సంపాదనకు ఇదో సోర్స్

సంపాదనకు ఇదో సోర్స్

స్వయంగా రాతపరీక్షలు నిర్వహించి మరీ బేరమాడుతున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అటెండర్ పోస్టు కావాలా..రూ.50వేలు ఇవ్వాల్సిందే... ఇంకొంచెం పెద్దదయితే..జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తారా... అయితే రూ.లక్షయినా ఇవ్వండి.. డబ్బులిస్తేనే ఉద్యోగం...ఔట్‌సోర్సింగ్  ద్వారా, ఏడాది ఉద్యోగమే అయినా సరే... కాసులు మాత్రం ముట్టజెప్పాల్సిందే... పైసలివ్వలేదంటే మీకు ఆ ఉద్యోగం చేసేందుకు అర్హత లేనట్టే... ఇదీ జిల్లాలో కొన్ని  ప్రైవేటు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల తీరు.

ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు ఈ ఏజెన్సీలు పండగ చేసుకుంటున్నాయి. నిరుద్యోగ యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని గ్యారంటీ లేని ఉద్యోగాలే అయినా గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు తీసేసుకుని ఇచ్చేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల దందా నడుస్తోంది. ఈ కళాశాలల్లో బోధనేతర పోస్టులను భర్తీ చేసేందుకుగాను ఏకంగా రాతపరీక్షలే నిర్వహించిన  ఏజెన్సీలు ఆ తర్వాత బేరసారాలు నడిపిస్తుండడం గమనార్హం.
 
పోస్టుకో రేటు
ఇటీవల జిల్లాలోని పలు డిగ్రీ కళాశాలల్లో అటెండర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, ఇతర టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. నకిరేకల్, ఆలేరు, చండూరులోని కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 14 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే, జిల్లాలోని మూడు ఏజెన్సీలు ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులను పంపుతామని కాంట్రాక్టు పొందాయి.  నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. వారికి హాల్‌టికెట్లు పంపి ఏకంగా రాతపరీక్ష కూడా నిర్వహించాయి.

నల్లగొండలో జరిగిన ఈ రాతపరీక్షలకు 52మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ రాత పరీక్షల తర్వాత అసలు కథ ప్రారంభమైంది. ఫలితాలను వెల్లడించి మెరిట్‌లిస్టులు పెట్టకుండానే ఆ ఏజెన్సీలు కాసుల దందాకు దిగుతున్నట్టు తెలుస్తోంది. పోస్టుకో రేటును ఫిక్స్ చేసి డబ్బులిస్తేనే ఎంపిక  చేస్తామని, లేదంటే ఏదో సాకు చెప్పి మెరిట్‌లిస్టులో పేరు తీసేస్తామని బేరమాడుతున్నట్టు సమాచారం.

ఈ కోవలో ఓ ఏజెన్సీ బేరసారాలాడిన నిరుద్యోగి ఒకరు ఁసాక్షి*తో మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పేరుతో పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నారు. నాకు అన్ని అర్హతలున్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం పెట్టిన రాతపరీక్షలో నాకు మంచి మార్కులు వస్తాయి. అయినా రూ.లక్ష ఇస్తేనే ఉద్యోగం వస్తుందంటున్నారు. లేదంటే నా పేరు మెరిట్‌లిస్టులో పెట్టరంట. ఇదేం పద్ధతి.* అని వాపోవడం గమనార్హం. అదేవిధంగా అటెండర్, ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు రూ.50వేల వరకు బేరాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఉద్యోగాల వేతనాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

రెగ్యులర్ పోస్టులో పనిచేసే ఉద్యోగికి ఉండే మూలవేతనం (బేసిక్)ను వారి నెల వేతనంగా నిర్ణయించడంతో రూ.6,700 నుంచి రూ.8500 వరకు మాత్రమే వారికి నెలసరి వేతనాలు వస్తున్నాయి. అయితే, ఈ ఉద్యోగాలను కొనసాగించే అవకాశం ఏజెన్సీలకు ఉండడంతో నిరుద్యోగులు పెద్దమొత్తంలో ఏజెన్సీ నిర్వాహకులకు డబ్బులు ముట్టజెపుతున్నారు.
 
కళ్లకు కడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల దందా వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చే దగ్గరి నుంచి నియామకాలు పొందిన వారి నెల జీతం ఇచ్చేంతవరకు ప్రభుత్వం అన్ని బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలమీదే పెడుతుండడంతో ఆ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరికీ కనిపించని రీతిలో నోటిఫికేషన్లు ఇస్తుండడంతో ఏజెన్సీలే ఫలానా పోస్టులున్నాయని, దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి.

దీంతో పాటు ఉద్యోగాల్లో నియామకాలు పూర్తయిన తర్వాత వారి వేతనాలను కూడా ఏజెన్సీలకే చెక్కుల రూపంలో ఇస్తుండడంతో  ఏజెన్సీల నిర్వాహకులు అప్పుడు కూడా కోత పెట్టి వేతనాలు ఇస్తున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. మరోవైపు ఉద్యోగుల పీఎఫ్ జమ చేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

కేవలం ప్రభుత్వం, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల మధ్యే ఒప్పందం కుదరడం, ఆ తర్వాత కనీసం పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లోనూ సంప్రదించే అవకాశం లేకపోవడంతో ఉద్యోగాలు చేయాలన్నా ఏజెన్సీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోందని నిరుద్యోగులంటున్నారు.

ఉద్యోగాల కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండడం, ఆ తర్వాత కొనసాగించాలన్నా ఏజెన్సీల అనుమతి కావాల్సి ఉండడంతో ఉద్యోగులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెన్సీల నిర్వాహకులను కూడా పల్లెత్తు మాట కూడా అనలేకపోతున్నారు. ఈ పద్ధతిలో ప్రభుత్వం తమకేం బాధ్యత లేదనే రీతిలో వ్యవహరిస్తుండడమే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యానికి కారణమవుతోందనే భావన నిరుద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement