3 నుంచి ఎంసెట్-3 హాల్‌టికెట్లు
11వ తేదీన రాతపరీక్ష.. పక్కాగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు సర్కారు పక్కాగా చర్యలు చేపడుతోంది. సెప్టెంబర్ 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్ష హాల్‌టికెట్లను ఈ నెల 3 నుంచే డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,153 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఇక ఈ రాత పరీక్షను పూర్తిగా నిఘా నీడలో చేపట్టనుంది. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఇప్పటికే పలుమార్లు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించింది.
మళ్లీ మళ్లీ మెడికల్ ఎంసెట్‌కు హాజరవుతున్న వారు, చాలా ఏళ్ల కింద ఇంటర్ ఉత్తీర్ణులైన వారు, ఇప్పటికే ఎంబీబీఎస్ చేస్తున్నవారు తిరిగి ఎందుకు ఎంసెట్ రాస్తున్నారన్న అంశంపై లోతైన విచారణ జరపాలని పోలీసు శాఖను కోరింది. ఇక విద్యార్థులు ఎంసెట్-3 హాల్‌టికెట్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు tseamcet.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
ఎంసెట్-2 పరీక్ష సమయంలో పలు కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తి అభ్యర్థుల నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్ డాటా) తీసుకోలేకపోయారు. దీంతో ఈసారి ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంసెట్-3 పరీక్ష సమయానికి గంట ముందు నుంచే విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకోనున్నారు. 2011 నుంచి జరిగిన అన్ని ఎంసెట్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఎంసెట్ కమిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.