ప్రైవేటు ఎం-సెట్ మాయ
డౌన్‌లోడ్ కాని హాల్‌టికెట్లు.. హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లూ దిక్కులేవు
♦ సీట్లు కొన్న వారికే డౌన్‌లోడ్ అయ్యేలా చేశారన్న ఆరోపణలు
♦ యథేచ్ఛగా అక్రమాలు.. ఆందోళనలో విద్యార్థులు
♦ అందుబాటులో లేని కన్వీనర్..
♦ ఫోన్ నంబర్ చెప్పేందుకు యాజమాన్యాల నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: సమాచారం ఇవ్వకుండా హడావుడిగా నోటిఫికేషన్.. పదిరోజుల్లోనే పరీక్ష, దరఖాస్తు గడువు 4 రోజులే.. ఇష్టారాజ్యంగా పరీక్షా కేంద్రాలు..
ఇప్పుడు డౌన్‌లోడ్ కాని హాల్‌టికెట్లు, ఫిర్యాదు చేద్దామన్నా దిక్కులేని ఫోన్ నంబర్లు... రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లో 35శాతం యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న ‘ప్రైవేటు’ ఎం-సెట్ మాయ ఇది. భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు, వందల కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్న ఈ పరీక్ష నిర్వహణ మరింత అనుమానాస్పదంగా మారుతోంది. బుధవారమే ఈ పరీక్ష జరుగనున్నా విద్యార్థులకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కావడం లేదు.
ఫిర్యాదు చేద్దామన్నా ఎలాంటి ఫోన్ నంబర్లూ లేవు, చివరికి ఈ పరీక్ష కన్వీనర్ కూడా అందుబాటులో లేరు. ఇప్పటికే సీటుకు కోటి రూపాయల చొప్పున అమ్మేసుకున్న కాలేజీలు.. ఆ అభ్యర్థులకే సీట్లు దక్కేలా ‘అంతా’ సిద్ధం చేసుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వ్యవహారం సాగుతోందని తెలుస్తోంది.
రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల సంఘం నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఎం-సెట్) బుధవారమే జరుగనున్నా.. ఈ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కావడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనేకమంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
దరఖాస్తును సబ్మిట్ చేసినప్పుడు ఆమోదించినట్లు సందేశం వచ్చాక... హాల్‌టికెట్ తీసుకునే సమయానికి ఎలా తిరస్కరణకు గురవుతాయని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా అసలు ఈ పరీక్షకు సంబంధించి ఎం-సెట్ కన్వీనర్ నుంచి కనీస వివరణలు కూడా వెలువడడం లేదు. ఆయనను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎం-సెట్ కన్వీనర్‌ను సంప్రదించేందుకు ఫోన్ నంబర్ ఇవ్వాలని యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ‘సాక్షి’ ప్రతినిధి అడగగా.. ఆయన తెలియదని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా స్పందించడం లేదు.
చేతులెత్తేసిన సర్కారు
ప్రత్యేక ఎం-సెట్‌పై ప్రైవేటు కాలేజీలకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం.. యాజమాన్యాల అక్రమాలను అడ్డుకోవడంపై చేతులెత్తేసింది. ‘ఈ పరీక్షకు మాకు సంబంధం లేదు. యాజమాన్యాలకే అప్పగించాం. ప్రశ్నపత్రాన్ని జేఎన్టీయూకు, పరీక్ష నిర్వహణ టాటా కన్సల్టెన్సీకి ఇచ్చాం. కాబట్టి మాకు బాధ్యత లేద’ని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతేగాకుండా పరీక్షా కేంద్రాలను ఏ ప్రభుత్వ అధికారి కూడా తనిఖీలు చేయలేదన్న విమర్శలున్నాయి. యాజమాన్యాలు అంతా గోప్యం గా, ఇష్టారాజ్యంగా పరీక్షను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. దీంతో ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు వైద్యవిద్య మరింత దూరం కానుంది.
సీట్లు కొన్నవారికే వచ్చేలా!
రాష్ట్రంలో 12 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35 శాతం యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక ఎం-సెట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఈ 35 శాతం సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్న యాజమాన్యాలు.. ఈ పరీక్షను నామమాత్రంగా నిర్వహిస్తున్నాయి. సీట్లు కొన్న విద్యార్థులకే ఇందులో ర్యాంకులు వచ్చేలా అంతా ‘సిద్ధం’ చేసేసుకున్నట్లు తెలిసింది. జేఎన్టీయూ ప్రశ్నపత్రం తయారు చేస్తున్నా, పరీక్ష నిర్వహణ బాధ్యతను టాటా కన్సల్టెన్సీకి అప్పగించినా.. యాజమాన్యాలు మాత్రం పకడ్బందీగా అక్రమాలకు వ్యూహం పన్నాయి.
తెలంగాణలో 15, ఏపీలో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కొన్నింటిలో ఇప్పటికే సీట్లు కొన్నవారు మాత్రమే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. తద్వారా వారు సులువుగా సమాధానాలు రాసేలా సిద్ధం చేశారని, ఈ మేరకు ఇన్విజిలేటర్లకు ప్రత్యేక సూచనలు చేశారని సమాచారం.
మైనారిటీ సీట్లకూ ప్రత్యేక పరీక్ష?
రాష్ట్రంలోని మైనారిటీ వైద్య కళాశాలల్లో ఉన్న 25 శాతం యాజమాన్య కోటా సీట్లకు కూడా నాన్-మైనారిటీ కాలేజీల తరహాలో ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) నిర్వహించాలని వాటి యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే దీనిని ప్రభుత్వం తిరస్కరించింది. ఆ ప్రత్యేక ఎం-సెట్‌తోపాటే మైనారిటీ సీట్లకు కూడా నిర్వహించి ఉంటే బాగుండేదని స్పష్టం చేసింది.
సాధారణ ఎంసెట్‌కు తోడు మరో రెండు పరీక్షలు నిర్వహించడం కుదరదని, పైగా ఈనెల 5వ తేదీ నాటికి ప్రవేశ పరీక్షలన్నీ అయిపోవాలన్న ఎంసీఐ నిబంధన ప్రకారం అది సాధ్యంకాదని తేల్చిచెప్పింది. మరోవైపు రాష్ట్రంలో రెండు మైనారిటీ వైద్య కాలేజీల్లో ఉన్న 75 యాజమాన్య కోటా సీట్లకు ఇంటర్ వెయిటేజీని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని సర్కారు యోచిస్తోంది. ఇక ఎన్నారై కోటా సీట్ల ఫీజును రూ.13.5 లక్షలకు పెంచాలని మైనారిటీ వైద్య కళాశాలలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఫైలు సీఎం వద్దకు వెళ్లినట్లు సమాచారం.