ప్రైవేటు సీట్ల భర్తీనే ముందు..! | Substitutes private before seat ..! | Sakshi
Sakshi News home page

ప్రైవేటు సీట్ల భర్తీనే ముందు..!

Published Mon, Aug 29 2016 3:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

ప్రైవేటు సీట్ల భర్తీనే ముందు..!

ప్రైవేటు సీట్ల భర్తీనే ముందు..!

- సెప్టెంబర్ 8న ప్రైవేటు మెడికల్ కాలేజీల నోటిఫికేషన్?
- నీట్ ద్వారా ‘యాజమాన్య’ సీట్ల భర్తీకి నిర్ణయం
ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు నష్టపోయే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: అన్నింటి కంటే ముందుగానే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీకి రంగం సిద్ధమైంది.  ‘నీట్’పై చివరి వరకు ఉత్కంఠ.. ఆ తర్వాత నీట్-2, ఎంసెట్-2 పరీక్షలు.. చివరకు ఎంసెట్-2 పేపర్ లీకేజీ.. మళ్లీ ఎంసెట్-3 మెడికల్ పరీక్షకు ఏర్పాట్లు.. ఇలా వైద్య కోర్సులో ప్రవేశాలకు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వైద్య సీట్ల అడ్మిషన్లకు సంబంధించి కూడా అస్పష్టత నెలకొంది. ఎంసెట్-3 మెడికల్ ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 11వ తేదీన, ఆ తర్వాత వారం పది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. కానీ ఈలోపే 50 శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు ‘నీట్’ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు యాజమాన్యాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.

సెప్టెంబర్ 8న నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నాయి. సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల అడ్మిషన్ పూర్తి కావాల్సి ఉండటంతో ప్రైవేటు కాలేజీలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. వాస్తవంగా ప్రభుత్వ, ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్ల భర్తీ జరిగాక.. వాటిలో సీట్లు రానివారు ప్రైవేటులోని యాజమాన్య సీట్లలో చేరుతారు. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎంసెట్-3 పరీక్ష జరిగి, ఫలితాలు వచ్చే సరికి సెప్టెంబర్ 20 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఎంసెట్-3లో ర్యాంకు వస్తుందో రాదో తెలి యక నీట్‌లో మంచి ర్యాంకు వచ్చిన వారు లక్షలు పోసి యాజమాన్య సీట్లలో చేరే పరిస్థితి ఏర్పడింది.   ప్రతిభ గల విద్యార్థులంతా నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో రూ.10 వేలు, ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లకు రూ.60 వేలు చెల్లించాల్సింది పోయి యాజమాన్య సీట్లకు రూ.11 లక్షలకు మించి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

 మొత్తం 3,450 సీట్లు
 రాష్ట్రంలో మొత్తం 21 మెడికల్ కాలేజీల్లో 3,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050 సీట్లు, 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 సీట్లు, మరో రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. ప్రైవేటు కాలేజీల్లోని 2,100 సీట్లలో 50 శాతం (1,050) సీట్లను ఎంసెట్ ర్యాంకు తెచ్చుకున్న వారికి ప్రభుత్వ ఫీజు ప్రకారం కేటాయిస్తారు. ‘నీట్’ ర్యాంకుల ద్వారా మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీల్లోని 1,150 సీట్లకు ముందుగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లోని 1,050 సీట్లు, ప్రైవేటు కన్వీనర్ కోటా సీట్లలో అవకాశం పొందాల్సిన వారంతా నష్టపోయే పరిస్థితి.
 
 ఈసారి సమస్యే..
 ఈసారి ఎంసెట్-3 నిర్వహిస్తుండటంతో కొంత సమస్య ఎదురైంది. ప్రైవేటు సీట్లకు ముందే కౌన్సెలింగ్ జరిగితే ప్రతిభ గల విద్యార్థులకు నష్టమే. ఎంసెట్-3 ఫలితాలు వచ్చాకే యాజమాన్య సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రైవేటు కాలేజీలను కోరుతాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కౌన్సెలింగ్ తర్వాత ప్రైవేటు యాజమాన్య సీట్ల కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరలేం. వైద్య సీట్ల అడ్మిషన్లకు సంబంధించి  గడువు కోసం సుప్రీంకోర్టుకు త్వరలో వెళ్లనున్నాం. దీనిపై ప్రభుత్వం వారం పది రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.     
 -డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement