‘వైద్య’ అక్రమార్కులపై వేటు
* ‘సాక్షి’ కథనంతో ప్రభుత్వం చర్యలు
* రూ. 2 కోట్లు చేతులు మారినట్లు ఇంటెలిజెన్స్ నివేదికతో కదలిక
* ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, ఎన్‌హెచ్‌ఎం ఏవో శ్రీనివాసరెడ్డిపై వేటు
* బాధ్యతల నుంచి తొలగించిన సర్కారు
* వైద్య మంత్రి పేషీలోని ఓఎస్డీలపైనా చర్య
సాక్షి, హైదరాబాద్: ‘అంగట్లో డాక్టర్ పోస్టులు’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అందుకు కారకులైన నలుగురు ఉన్నతాధికారులపై గురువారం వేటుపడింది. సదరు ఏజెన్సీలకు అనుమతినిస్తూ అంతర్గత ఉత్తర్వులు ఇచ్చిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డెరైక్టర్ సాంబశివరావును బాధ్యతల నుంచి తొలగించింది.
ఆ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సాంబశివరావును సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చినా ప్రభుత్వం ధ్రువీకరించలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిపాలనాధికారి(ఏవో) శ్రీనివాసరెడ్డినీ ఆ బాధ్యతల నుంచి తొలగించింది. వైద్య, పారామెడికల్ పోస్టులను అమ్ముకుంటున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే వైద్య మంత్రి రాజయ్య పేషీలోని ఓఎస్డీలు డాక్టర్ సంపత్, డాక్టర్ గంగాధర్‌ను కూడా బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిసింది.
అయితే మంత్రి కార్యాలయవర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. ఎన్‌హెచ్‌ఎం మంజూరు చేసిన 1500 వైద్య సిబ్బంది పోస్టుల్లో నియామకాలు చేపట్టేందుకు కొన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు సాంబశివరావు అనుమతించారు. అయితే ఇందుకు ప్రభుత్వంలోని కీలక నేతతో పాటు కొందరు ఉన్నతాధికారులు సదరు ఏజెన్సీల నుంచి లంచం తీసుకున్నారన్న విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దీనిపై విచారణ జరిపిన నిఘా వర్గాలు.. రూ. రెండు కోట్లు చేతులు మారినట్లు స్పష్టం చేశాయి. ఈ నివేదిక ఆధారంగానే తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఓఎస్డీలు కూడా అతిగా వ్యవహరిస్తున్నారని, విభాగాధిపతులు, అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వారిని తొలగించినట్లు సమాచారం.
మార్గదర్శకాలు ఖరారు...
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఔట్‌సోర్సింగ్ వైద్య, పారామెడికల్ పోస్టుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఆ ప్రకారం జిల్లా ఆరోగ్య సంస్థల(డీహెచ్‌సీ) ద్వారానే పోస్టులను నింపాలి. తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. అభ్యర్థి స్థానికుడై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్వ్యూలు నిర్వహించకూడదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరగాలి. ఇద్దరు అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులుంటే వారి పుట్టిన రోజును ఆధారం చేసుకోవాలి.
పుట్టిన రోజులు కూడా ఒకే తేదీగా ఉంటే... వారి మండలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల అర్హతలు, వాటి అనుభవాన్ని ఆధారం చేసుకోవాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని డీహెచ్‌ఎస్‌ల నిపుణుల కమిటీ ఆ ఏజెన్సీలను ఆమోదించాలి. ఈ మార్గదర్శకాలను సీఎంకు పంపిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. సీఎం ఆమోదం లభించాక జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ జారీచేసి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నియామకం చేపడతారు. అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుకానుంది.