‘అంగట్లో వైద్య పోస్టులు’ రద్దు!
‘సాక్షి’ కథనంపై స్పందించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అంగట్లో డాక్టర్ పోస్టుల’ బాగోతానికి తెరపడింది. నిబంధనలను విరుద్ధంగా జరిగిన నియామకాలు నిలి చిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కన్నెర్రజేశారు. 1,500 వైద్య పోస్టులను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకానికి బెట్టిన వైనాన్ని ‘అంగట్లో వైద్య పోస్టులు’ శీర్షికన ‘సాక్షి’ సోమవారం బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్‌లను సీఎం సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకుని దీనిపై నిల దీసినట్లు సమాచారం. ‘‘జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఆరోగ్య సంస్థలు భర్తీ చేయాల్సిన పోస్టులకు... ఇన్‌చార్జి కమిషనర్ ఉత్తర్వులెలా ఇచ్చారు?’’ అని సీఎం ప్రశ్నించారు.‘‘అవినీతిరహితులు, చక్కని అడ్మిని స్ట్రేటర్ అని నమ్మి మిమ్మల్ని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించాం. కానీ మీ శాఖ లో జరుగుతున్న అవినీతి నియమాకాలను చూసీచూడనట్లుగా వ్యవహరించారు.
ఇది పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక. తొలిసారి అవినీతికి సంబంధించిన వార్త వచ్చింది’’ అని చందాను ఉద్దేశించి అన్నట్టు సమాచారం. ‘‘సదరు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయండి. ఇప్పటికే నియమాకాలు చేపడితే వాటిని రద్దు చేయండి. కొత్త మార్గదర్శకాలను రెండురోజుల్లో ఖరారు చేసి జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వండి’’ అని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు ఆగమేఘాల మీద ఆ పనిలో ఉన్నారు. ‘‘మెరిట్ ఆధారంగా, జిల్లా ఆరోగ్య సంస్థల ద్వారానే పోస్టులను భర్తీ చేయాలి. అర్హతలు, అనుభవాన్ని ఆధారంగా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను ఆమోదించాలి’’ అని తాజా మార్గదర్శ కాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వాటిని సీఎం ఆమోదించాక నోటిఫికేషన్ ఇస్తారు. ఔట్‌సోర్సింగ్ అక్రమాలపై సీఎం తక్షణం స్పందన పట్ల తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం నర్సింగ్, పారామెడికల్ సంఘం హర్షం వెలిబుచ్చాయి.