వైద్య సేవలు మరింత విస్తరించాలి
- మాదాపూర్‌లో సన్‌షైన్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: హెల్త్‌హబ్‌గా పేరున్న హైదరాబాద్‌లో వైద్యసేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కొత్తగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 200 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సన్‌షైన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అత్యుత్తమ సేవలతో సన్‌షైన్ ఆస్పత్రి జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్‌లతో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ ఆస్పత్రులను ఏర్పాటు చేసి సేవలు విస్తరింపజేయాలని సూచించారు.
25 వేలకుపైగా జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు నిర్వహించిన ఘనత ఆస్పత్రి సొంతమని కొనియాడారు. ఈ ఆస్పత్రిపై ఉన్న నమ్మకంతోనే కీళ్లనొప్పులతో బాధపడుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని చికిత్స కోసం డాక్టర్ గురవారెడ్డిని సంప్రదించాల్సిందిగా సూచిం చినట్లు తెలిపారు. సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గురవా రెడ్డి మాట్లాడుతూ.. మాదాపూర్, హైటెక్‌సిటీ, శేర్‌లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఇక్కడ ఆస్పత్రిని నెలకొల్పినట్లు తెలిపారు. రోగుల అవసరాలకు తగ్గట్లు కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, న్యూరోసర్జరీ తదితర విభాగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం కోరితే నిరుపేదలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కె.కేశవరావు, వైద్యఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆస్పత్రి ఎండీ డాక్టర్ అనీల్‌కృష్ణ, సినీ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.