హైదరాబాద్‌ను హెల్త్‌హబ్‌గా మార్చండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను ఉపయోగించుకొని నగరాన్ని హెల్త్ హబ్‌గా మార్చాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సచివాలయంలో మంగళవారం ప్రముఖ హ్రుద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజు, డాక్టర్ కాశీరాజు, డాక్టర్ కృష్ణారెడ్డి, ఇతర వైద్యులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సమాచార, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యరంగంలో విరివిగా వాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థలు సంయుక్తంగా రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. స్టంట్స్‌తో సహా ఇతర మెడికల్ డివైజ్‌లు కూడా రాష్ట్రంలోనే తయారు చేసుకోగలిగితే వైద్య ఖర్చులను తగ్గించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిష్ణాతులైన వైద్యులతో ఆరోగ్య సలహా మండలి ఏర్పాటు చే సే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఐదారు కార్పొరేట్ వైద్య సంస్థలు మెరుగైన వైద్యం అందిస్తున్నాయని ప్రశంసించారు. ఆ సంస్థలు అన్ని హంగులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన సదుపాయాలు, నిపుణులైన వైద్యులతో హెల్త్ క్యాంపస్‌లు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నగరంలోని ఇతర ప్రాంతాలు, జిల్లాలు, గ్రామీణ ప్రాం తాల్లోని ఆసుపత్రులతో ఈ క్యాంపస్ ఆన్‌లైన్ కనెక్టివిటీ కలిగి ఉండాలన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతులు, అవసరమైన సలహాలు కూడా ఆన్‌లైన్‌లోనే అందాలని... అత్యవసరమైతే రోగులను క్యాంపస్‌కు తరలించాలని అన్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య పరిపాలనాధికారుల అవసరాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆసుపత్రుల్లో మెరుగైన నిర్వహణ అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. తమిళనాడు తరహాలో ప్రభుత్వ వైద్యాన్ని మెరుగ్గా అందిస్తామన్నారు. ైవైద్యం రోగ నిర్ధారణ, చికిత్సల కోసమే కాకుండా అసలు రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు చెప్పడం ముఖ్యమని సీఎం పేర్కొన్నారు.