మెడిసీన్‌! | Cyber Crime Gangs Eye On medical Seats Fraud | Sakshi
Sakshi News home page

మెడిసీన్‌!

Published Tue, Sep 4 2018 9:17 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Cyber Crime Gangs Eye On medical Seats Fraud - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వైద్య విద్య సీట్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది. ర్యాంక్‌ రాకపోతే ‘రేటు’తో అయినా సీటు దక్కించుకునేందుకు అనేక మంది సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రేజ్‌నే కొన్ని ముఠాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఉత్తరాది నుంచి వచ్చిన ముఠాలు నగరవాసులకు టోకరా వేస్తుంటే... నగరం కేంద్రంగా కొన్ని గ్యాంగ్స్‌ ఉత్తరాదికి చెందిన వారిని ముంచుతున్నాయి. గడిచిన రెండు నెలల వ్యవధిలో సైబర్‌ క్రైమ్, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రెండు ఘరానా ముఠాలను పట్టుకోగా... 10 రోజుల వ్యవధిలోనే మాదాపూర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 

వెబ్‌సైట్స్‌ నుంచే డేటా...
ఎంబీబీఎస్‌తో పాటు మెడిసిన్‌ పీజీ సీట్ల పేరుతో టోకరా వేస్తున్న ముఠాల్లో కొన్ని కన్సల్టెన్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని గ్యాంగ్స్‌ కేవలం ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్, బల్క్‌ ఎస్సెమ్మెస్‌లతో ఎర వేస్తున్నాయి. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న అభిమన్యుకుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని ముఠా బిహార్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సోమాజిగూడలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసింది. సీసీఎస్‌ అధీనంలోని సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌కు రెండు నెలల క్రితం చిక్కిన సంతోష్‌రాయ్‌ నేతృత్వంలోని గ్యాంగ్‌ ఢిల్లీ కేంద్రంగా కేవలం బల్క్‌ ఎస్సెమ్మెస్‌లతో కథ నడిపించింది. ఇలాంటి మోసగాళ్లకు అభ్యర్థుల వివరాలు ‘అధికారికంగానే’ అందుతున్నాయి. ఆయా ప్రవేశ పరీక్షలు నిర్వహించే విభాగాలు తమ అధికారిక వెబ్‌సైట్స్‌లో అభ్యర్థుల పేర్లు, ర్యాంక్‌లతో పాటు వారి ఫోన్‌ నెంబర్లు సైతం పొందుపరుస్తున్నాయి. వీటిని సంగ్రహించి, వాటి ఆధారంగానే వారికి కౌన్సెలింగ్‌లో సీట్లు వస్తాయా? రావా? అనేది అంచనా వేస్తున్న మోసగాళ్లు రంగంలోకి దిగి ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. 

ఫిర్యాదుకు వెనకడుగు...  
ఇలాంటి ముఠాల చేతిలో మోసపోతున్న వారిలో బడాబాబులతో పాటు వైద్యులూ ఉంటున్నారు. తమ పిల్లలకు అడ్డదారిలో సీట్లు ఖరీదు చేయడానికి ముందుకొచ్చి నిండా మునుగుతున్నారు. అయితే మోసపోయిన వారిలో కనీసం 10శాతం మంది కూడా ముందుకొచ్చి ఫిర్యాదు చేయట్లేదు. దీనికి ప్రధాన కారణం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ భయమని పోలీసులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఘరానా ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇలాంటి వారికి ప్రధానంగా బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మెడికల్‌ కాలేజీల్లో వివిధ కోటాల్లో సీట్లు ఇప్పిస్తామంటూ పేర్కొంటున్నారు. ఆపై ఒక్కో సీటుకు రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఖర్చవుతుందని స్పష్టం చేస్తున్నారు. దీనికి అంగీకరించిన వారి నుంచి తొలుత అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారు. కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు చేస్తున్నారు. దీనికోసం అవసరమైతే తమ అనుచరుల్ని పంపిస్తున్నారు. ఇలా చేయడంతో మోసపోయిన వారు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. పోలీసుల్ని ఆశ్రయిస్తే ముందు తామిచ్చిన నగదుకు లెక్కలు చెప్పాల్సి వస్తుందని, ఐటీ విభాగం రంగంలోకి దిగుతుందని భయపడి ఫిర్యాదులే చేయడం లేదు.   

ఇటు వారటు... అటు వారిటు...
ఉత్తరాదికి చెందిన ముఠాలు నగరానికి చెందిన వారిని మోసం చేసి సైబర్‌ క్రైమ్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాయి. ఇలానే నగర కేంద్రంగా ఉత్తరాదికి చెందిన వారినీ కొందరు మోసం చేస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో దీనికి సంబంధించి మాదాపూర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఎర వేసిన మోసగాళ్లు అతడి నుంచి రూ.16 లక్షలు కాజేశారు. దీనికి సంబంధించి గత నెల 24న బాధితుడు మాదాపూర్‌ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ మోసగాళ్లు హైదరాబాద్‌తో పాటు పుణెలోనూ కన్సల్టెన్సీ నిర్వహించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఇది జరిగిన వారం రోజుల్లోనే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ రైల్వే ఉద్యోగి నుంచి మెడిసిన్‌ సీట్ల పేరుతో రూ.29 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో గత నెల 31న అదే మాదాపూర్‌ ఠాణాలో మరో కేసు నమోదైంది. ఈ రెండూ వేర్వేరు కన్సల్టెన్సీలని, బెంగళూరులోని మెడికల్‌ కాలేజీల్లో సీట్లు ఇస్తామంటూ మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ గ్యాంగ్స్‌ సైతం నగదు రూపంలోనే డబ్బు తీసుకున్నాయని, తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకూ ఇలా చేసి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలో, డీడీలు, చెక్కులో వినియోగిస్తే తాము చిక్కుతామని నగదునే తీసుకున్నట్లు వివరిస్తున్నారు.  

ఆ ఇద్దరి కస్టడీకి నిర్ణయం...  
బెంగళూర్‌లోని వివిధ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతూ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు శుక్రవారం చిక్కిన ముఠాలోని ఇద్దరినీ పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. వీరిద్దరినీ పంజగుట్ట అధికారులు రిమాండ్‌కు తరలించినవ విషయం విదితమే. ఈ గ్యాంగ్‌ రెండు రాష్ట్రాల్లో అనేక మంది నుంచి రూ.90 లక్షల వరకు దండుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సిటీలో ఏర్పాటు చేసిన కార్యాలయం కేంద్రంగా 20 మందికి ఎర వేశారు. ఒక్కో సీటు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చవుతుందంటూ చెప్పారు. వీరి నుంచి రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని ఉడాయించారు. అయితే కేవలం రెండు కేసులే రిజిస్టర్‌ అయ్యాయి. మిగిలిన బాధితుల్ని గుర్తించడంతో పాటు పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని పట్టుకోవడానికి అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement