అలంకారప్రాయంగా ట్రామా కేర్ సెంటర్
సాక్షి, ముంబై: కోట్ల రూపాయల ప్రజాధన్మంతో ఎంతో భారీగా నిర్మించి, ఆర్భాటంగా ప్రారంభించిన ట్రామా కేర్ సెంటర్ సరైన సదుపాయాలు లేక వెలవెలబోతోంది. రూ.134 కోట్ల వ్యయంతో 13 అంతస్తులు నిర్మించిన ట్రామా కేర్ సెంటర్‌ను గత అక్టోబర్‌లో ప్రారంభించిన సంగతి తెల్సిందే. అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ట్రామా కేర్‌లో రోగులు ఎలాంటి చికిత్సకు నోచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆస్పత్రికి బీఎంసీకి చెందిన ఇంప్రూవ్‌మెంట్ కమిటీ సదుపాయాలను సమకూర్చాల్సి ఉంది. కానీ కనీసం ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ యంత్రా ల ఏర్పాటుకు అనుమతి కూడా ఇవ్వలేకపోయింది. ఆస్పత్రి నిర్మాణ సమయంలోనే దీనిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెప్పుకున్నారు.
అందుకు తగినట్లు స్పెషలిస్టు డాక్టర్లను నియమించేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఉన్న వైద్య సిబ్బంది కూడా అరకొరగా ఉన్నారు. ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణులు, సరైన పరికరాలు లేకపోవడంతో ఇక్కడికి వచ్చే రోగులను శస్త్ర చికిత్సల కోసం తప్పనిసరిగా ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోందని ఇక్కడ పని చేసే ఓ వైద్యుడు చెప్పారు. వివిధ వైద్య విభాగాలలో వైద్యుల కొరత ఉందని అన్నారు. ఆస్పత్రిని ప్రారంభించి ఎనిమిది నెలలు దాటిపోయినా ఇంతవరకు స్పెషలిస్టులను నియమించలేదని అన్నారు.
వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాలకు గురైన బాధితుల ప్రాణాలను నిలబెట్టడానికి ఇక్కడ సర్జన్, న్యూరో సర్జన్‌ల అవసరం ఉంటుందని ఆ డాక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బ్లడ్ బ్యాంక్ కూడా కాగితాలకే పరిమితమైంది. కానీ ఆస్పత్రిని చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దినప్పటికీ ఎలాంటి సదుపాయాలు సమకూర్చ లేదు. ఇక్కడ 104 మంది రోగులకు వైద్యం అందించేందుకు బెడ్లు ఉన్నాయి.
కానీ అన్నీ ఖాళీగానే పడి ఉన్నాయి. ఆస్పత్రి ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూ 20 శాతానికి మించి రోగులు చేరలేదని ఆ డాక్టర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, 104 పడకలకు గాను కేవలం 30 మంది నర్సులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.అడిషినల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. త్వరలోనే స్పెషలిస్టు వైద్యులను కూడా నియమిస్తామన్నారు.