Trauma Care Center
-
ట్రామాకేర్.. బేఫికర్
సాక్షి, నర్సంపేట(వరంగల్) : అతివేగం అనర్థం. అయితే, దీనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో నిత్యం రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. పదుల కొద్ది ప్రాణాలు ఒక్క ప్రమాదంతో గాలిలో కలిసిపోయిన ఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్రాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారులు ఉమ్మడి జిల్లా మీదుగానే ప్రయాణిస్తున్నాయి. అవి నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. తీవ్రంగా గాయపడి జీవితాంతం అవిటివారిగా జీవనం వెళ్లదీస్తున్న వారు చాలామంది ఉన్నారు. గత సంవత్సరం ప్రమాదాల్లో 40 శాతం రహదారులపై జరిగినవే ఉన్నాయి. ప్రమాదం జరిగిన తొలి రెండు గంటల్లో సరైన వైద్యం అందక మరణించిన వారు చాలామంది ఉన్నారు. ప్రమాదాలు ఎక్కువగా హైదరాబాద్ – భూపాలపట్నం ఎన్‌హెచ్163పైనే జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ, రాష్ట్రయ రహదారులను అనుసంధానం చేస్తున్న పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సైతం సిద్ధమయ్యాయి. ట్రామా కేర్ అంటే ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాల్లో ప్రధానంగా ఎముకలు విరుగుతుంటాయి. రక్తనాళాలు, నాడీ కణాలు తెగిపోతుంటాయి. అవయవాల్లో రక్తస్రావం జరుగుతుంటుంది. ఫలితంగా చాలామంది మృత్యువాత పడుతుంటారు. ఆయా విభాగాలను ఒకే చోటకు తెచ్చి అత్యవసర వైద్యం అందించడమే ట్రామా కేర్ వైద్యం. వైద్య బృందం.. పరికరాలు ఆర్థోపెడిక్ సర్జన్, అనస్తీషియా, అత్యవసర వైద్య నిపుణుడు, న్యూరో సర్జన్, వ్యాసుకులర్ సర్జన్ ఈ సెంటర్లలో ఉంటారు. ఇక 24 గంటల పాటు ఐసీయూ, వెంటిలేటర్లు, డయాలసిస్ కేంద్రం, ఎండోట్రేకియా ట్యూబ్ లాంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేకంగా రక్తనిధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇవీ ఉపయోగాలు గాయపడిన వారికి తక్షణమే వైద్యసాయం అందుతుంది. ప్రమాదం జరిగిన తొలిగంటలోనే చికిత్స అందితే 90 శాతం మేర బతికే అవకాశం ఉంటుంది. సూపర్‌స్పెషాలిటీ వైద్యం జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో అందుతుంది. ప్రస్తుతం వైద్యశాలలు రెఫరల్ కేంద్రాలుగానే పనిచేస్తున్నాయి. ఏరియా వైద్యశాలలు ట్రీట్మెంట్ కేంద్రాలుగా ప్రారంభమవుతాయి. బాధితులకు ఆర్థిక వెసులుబాటు సైతం కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలో నాలుగు.. రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించి మరణాల సంఖ్యను తగ్గించడమే ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యం. ఈ మేరకు రాష్ట్రంలో 28 ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, వరంగల్, ములుగులో ట్రామా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో సెంటర్‌కు రూ.75 లక్షల నిధులను కేటాయించనున్నారు. మొత్తంగా రూ.4.26 కోట్లు నిధులు రానున్నాయి. అదనంగా కేంద్ర నిధులు కూడా వస్తాయి. ఈ నిధులతో భవనాలు, సిబ్బంది, పరికరాల ఏర్పాటు జరుగుతుంది. సెంటర్ల ఏర్పాటు అభినందనీయం తెలంగాణ ప్రభుత్వం 28 ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయం. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వైద్యశాలల ఏర్పాటు చేయాలని ఇచ్చిన విజ్ఞప్తికి న్యాయం జరిగినట్లయింది. ఇందుకు సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్యమంత్రికి కృత్ఞజ్ఞతలు తెలుపుతున్నా. – శానబోయిన రాజ్‌కుమార్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నిర్వాహకులు మరణాల సంఖ్య తగ్గించవచ్చు.. ప్రతీ సంవత్సరం రోడ్డు ప్రమాదంలో 40 శాతం మంది చనిపోతున్నారు. ఎక్కువ జాతీయ రహదారులపైనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రామా కేర సెంటర్ల ద్వారా మరణాలను అరికట్టిన వారమవుతాం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం – జలగం సుధీర్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ట్రామాకేర్ సెంటర్లు అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం జరుగుతుంది. చాలామందిని మరణం నుంచి తప్పించిన వారమవుతాం. 24 గంటల పాటు సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందుతుంది. అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ గోపాల్, నర్సంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ట్రామాకేర్‌సెంటర్ మరో 6 నెలలు వాయిదా
సాక్షి, ముంబై: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఏర్పాటు చేసిన ట్రామాకేర్ సెంటర్ ప్రారంభం మరో ఆరు నెలల పాటు వాయిదా పడింది. నిర్వహణ లోపం, ఎయిర్ ఆంబులెన్స్ పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకెళితే 94 కి.మీ మేర ఉన్న ముంబై-పుణే ైెహ వేలో ప్రమాదం జరిగినపుడు బాధితులను ఆస్పత్రికి తరలించేలోపు మృత్యువాత పడుతున్నారు. దీంతో ఈ మార్గంపై నాలుగు ట్రామా కేంద్రాల్ని ఏర్పాటు చేసి తగు పరికరాలతో ఎయిర్ ఆంబులెన్ ్స సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పెలైట్ ప్రాజెక్టుగా తెలంగాణ టోల్ ప్లాజా వద్ద ఒజార్డే గ్రామంలో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించడం కోసం ఈ ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం ఎమ్మెస్సార్డీసీ రూ. 4 కోట్లు ఖర్చు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులు 2013లో ప్రారంభమవగా, గతేడాది నవంబర్‌లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అనుభవం కలిగిన కంపెనీలు సెంటర్‌ను నిర్వహించాల్సిందిగా ఎమ్మెస్సార్డీసీ కోరగా, పుణేలోని లోక్మాన్య ఆస్పత్రి సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. రోగులను ఆస్పత్రికి చేర్చే అంశం, ఇంధన ఖర్చు చెల్లింపు విషయంలోనూ పలు సమస్యలున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్ కావాలనుకున్న రోగులు మాత్రమే ఈ ఖర్చులు భరిస్తారని ఎమ్మెస్సార్డీసీ తేల్చి చెప్పింది. 2006 నుంచి 2014 వరకు ఈ మార్గంపై జరిగిన ప్రమాదాల్లో 925 మంది మరణించగా, 2,473 మందికి గాయాలయ్యాయి. -
నవంబర్‌లోపు పూర్తిస్థాయి వైద్య సేవలు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ మెడికల్ కళాశాలలో నవంబర్ లోపు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని డీఎంఈ (డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్) పుట్ట శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మెడికల్ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో వైద్యుల ను, సిబ్బందిని నియమించి మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో చిన్న చిన్న ఇబ్బందులను తొలగిస్తామన్నారు. ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే, అ క్టోబర్ చివరిలోపు నియా మకాలను పూర్తి చేస్తామన్నారు. ఈ విషయమై ఇది వరకే ప్రభుత్వంతో చర్చిం చామన్నారు. అవసరమైతే గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలల నుంచి ప్రొఫెసర్లను, వైద్యులను ఇక్కడికి తీసుకువస్తామన్నారు. కళాశాలలో డీఎన్బీ కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైద్య విద్యా బోధనను మెరుగుపరుస్తామన్నారు. గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై చర్యలు తప్పవన్నారు. ఆయా ప్రొఫెసర్ల వివరాలను తనకు అందజేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. వైద్య విధాన పరి షత్, కళాశాల వైద్యుల మధ్య పొరపొచ్చాలు ఉన్నాయని వీటిని పరిష్కరిస్తామన్నారు. -
ప్రారంభం కాని ‘ట్రామా’
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్‌ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. 2013 డిసెంబర్ 15వ తేదీన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కేశవ్ దేశ్రాజ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వైవీ అనూరాధ, వైద్య ఆరోగ్యమిషన్ డెరైక్టర్లు డాక్టర్ బుద్ధ ప్రకాశ్, జ్యోతి కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, ట్రామాకేర్ సెంటర్ భవనాన్ని సందర్శించారు. నివేదికలు పూర్తిగా సిద్ధం చేసుకుని వెళ్ళారు. అయితే వారు సందర్శించి 6 నెలలకుపైగా గడిచినా ట్రామాకేర్ సెంటర్ ప్రారంభం విషయంలో ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. రూ.4 కోట్లకు పైగా నిధులతో.. రహదారులపై ప్రమాదాలకు గురయ్యేవారికి వైద్యం అందించడానికి రూ. 4 కోట్లకుపైగా నిధులతో ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికి ట్రామాకేర్ సెంటర్ భవన నిర్మాణానికి రూ. 67 లక్షలు ఖర్చు చేశారు. అలాగే మరో రూ. కోటితో ఆధునాతన అంబులెన్స్, ఎక్స్‌రే యంత్రం, ఈసీజీ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు కొన్నారు. అయితే అవన్నీ ఆయా గదుల్లో తుప్పు పడుతున్నాయి. ఆస్పత్రి ఆవరణలో ఆంబులెన్స్ ధ్వసం అయి ఉంది. ఇంకా రూ. కోటిన్నర విలువగల యంత్రాలు రావాల్సి ఉంది. అలాగే ఈ సెంటర్‌కు కావాల్సిన ఆర్థోపెటిక్ సర్జన్లు, మత్తు డాక్టర్లు, న్యూరాలజిస్టు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులను నియమించాల్సి ఉంది. లక్షల రూపాయలు గుల్ల కామారెడ్డి జాతీయ రహదారితోపాటు ఆయా మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు మెరుగైన వైద్యం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ట్రామాకేర్ సెంటర్ ప్రారంభమైతే ఇక్కడే మెరుగైన వైద్యసేవలు అందేవి. సెంటర్ ప్రారంభం కాకపోవడంతో క్షతగాత్రులు ప్రైవేట్ ఆస్పత్రులు, హైదరాబాద్‌కు వెళ్లడంతో వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. నెల రోజుల్లోనే 11 మంది మృతి కామారెడ్డి డివిజన్ పరిధిలో కేవలం జూన్ ఒక్క నెలల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతిచెందగా 20 మందికి తీవ్ర గాయాల య్యాయి. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యు వకులే మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. వీ రిలో తలకు గాయాలై చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కొందరు మృతిచెందా రు. వీరికి ట్రామాకేర్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందితే కొందరైన బతికుండేవా రు. మాచారెడ్డి, సదాశివనగర్, భిక్కనూరు, గాంధారి, దోమకొండ మండలాలతో పాటు డి చ్‌పల్లి నుంచి రామాయంపేట్ వరకు జాతీయరహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతూ చాలామంది మృత్యువాత పడుతున్నారు. -
అలంకారప్రాయంగా ట్రామా కేర్ సెంటర్
సాక్షి, ముంబై: కోట్ల రూపాయల ప్రజాధన్మంతో ఎంతో భారీగా నిర్మించి, ఆర్భాటంగా ప్రారంభించిన ట్రామా కేర్ సెంటర్ సరైన సదుపాయాలు లేక వెలవెలబోతోంది. రూ.134 కోట్ల వ్యయంతో 13 అంతస్తులు నిర్మించిన ట్రామా కేర్ సెంటర్‌ను గత అక్టోబర్‌లో ప్రారంభించిన సంగతి తెల్సిందే. అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ట్రామా కేర్‌లో రోగులు ఎలాంటి చికిత్సకు నోచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆస్పత్రికి బీఎంసీకి చెందిన ఇంప్రూవ్మెంట్ కమిటీ సదుపాయాలను సమకూర్చాల్సి ఉంది. కానీ కనీసం ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రా ల ఏర్పాటుకు అనుమతి కూడా ఇవ్వలేకపోయింది. ఆస్పత్రి నిర్మాణ సమయంలోనే దీనిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెప్పుకున్నారు. అందుకు తగినట్లు స్పెషలిస్టు డాక్టర్లను నియమించేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఉన్న వైద్య సిబ్బంది కూడా అరకొరగా ఉన్నారు. ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణులు, సరైన పరికరాలు లేకపోవడంతో ఇక్కడికి వచ్చే రోగులను శస్త్ర చికిత్సల కోసం తప్పనిసరిగా ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోందని ఇక్కడ పని చేసే ఓ వైద్యుడు చెప్పారు. వివిధ వైద్య విభాగాలలో వైద్యుల కొరత ఉందని అన్నారు. ఆస్పత్రిని ప్రారంభించి ఎనిమిది నెలలు దాటిపోయినా ఇంతవరకు స్పెషలిస్టులను నియమించలేదని అన్నారు. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాలకు గురైన బాధితుల ప్రాణాలను నిలబెట్టడానికి ఇక్కడ సర్జన్, న్యూరో సర్జన్ల అవసరం ఉంటుందని ఆ డాక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బ్లడ్ బ్యాంక్ కూడా కాగితాలకే పరిమితమైంది. కానీ ఆస్పత్రిని చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దినప్పటికీ ఎలాంటి సదుపాయాలు సమకూర్చ లేదు. ఇక్కడ 104 మంది రోగులకు వైద్యం అందించేందుకు బెడ్లు ఉన్నాయి. కానీ అన్నీ ఖాళీగానే పడి ఉన్నాయి. ఆస్పత్రి ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూ 20 శాతానికి మించి రోగులు చేరలేదని ఆ డాక్టర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, 104 పడకలకు గాను కేవలం 30 మంది నర్సులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.అడిషినల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. త్వరలోనే స్పెషలిస్టు వైద్యులను కూడా నియమిస్తామన్నారు.