ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నర్సంపేట(వరంగల్) : అతివేగం అనర్థం. అయితే, దీనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో నిత్యం రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. పదుల కొద్ది ప్రాణాలు ఒక్క ప్రమాదంతో గాలిలో కలిసిపోయిన ఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్రాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారులు ఉమ్మడి జిల్లా మీదుగానే ప్రయాణిస్తున్నాయి. అవి నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. తీవ్రంగా గాయపడి జీవితాంతం అవిటివారిగా జీవనం వెళ్లదీస్తున్న వారు చాలామంది ఉన్నారు. గత సంవత్సరం ప్రమాదాల్లో 40 శాతం రహదారులపై జరిగినవే ఉన్నాయి. ప్రమాదం జరిగిన తొలి రెండు గంటల్లో సరైన వైద్యం అందక మరణించిన వారు చాలామంది ఉన్నారు. ప్రమాదాలు ఎక్కువగా హైదరాబాద్ – భూపాలపట్నం ఎన్‌హెచ్163పైనే జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ, రాష్ట్రయ రహదారులను అనుసంధానం చేస్తున్న పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సైతం సిద్ధమయ్యాయి.
ట్రామా కేర్ అంటే
ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాల్లో ప్రధానంగా ఎముకలు విరుగుతుంటాయి. రక్తనాళాలు, నాడీ కణాలు తెగిపోతుంటాయి. అవయవాల్లో రక్తస్రావం జరుగుతుంటుంది. ఫలితంగా చాలామంది మృత్యువాత పడుతుంటారు. ఆయా విభాగాలను ఒకే చోటకు తెచ్చి అత్యవసర వైద్యం అందించడమే ట్రామా కేర్ వైద్యం.
వైద్య బృందం.. పరికరాలు
ఆర్థోపెడిక్ సర్జన్, అనస్తీషియా, అత్యవసర వైద్య నిపుణుడు, న్యూరో సర్జన్, వ్యాసుకులర్ సర్జన్ ఈ సెంటర్లలో ఉంటారు. ఇక 24 గంటల పాటు ఐసీయూ, వెంటిలేటర్లు, డయాలసిస్ కేంద్రం, ఎండోట్రేకియా ట్యూబ్ లాంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేకంగా రక్తనిధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.
ఇవీ ఉపయోగాలు
గాయపడిన వారికి తక్షణమే వైద్యసాయం అందుతుంది. ప్రమాదం జరిగిన తొలిగంటలోనే చికిత్స అందితే 90 శాతం మేర బతికే అవకాశం ఉంటుంది. సూపర్‌స్పెషాలిటీ వైద్యం జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో అందుతుంది. ప్రస్తుతం వైద్యశాలలు రెఫరల్ కేంద్రాలుగానే పనిచేస్తున్నాయి. ఏరియా వైద్యశాలలు ట్రీట్‌మెంట్ కేంద్రాలుగా ప్రారంభమవుతాయి. బాధితులకు ఆర్థిక వెసులుబాటు సైతం కలుగుతుంది.
ఉమ్మడి జిల్లాలో నాలుగు..
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించి మరణాల సంఖ్యను తగ్గించడమే ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యం. ఈ మేరకు రాష్ట్రంలో 28 ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, వరంగల్, ములుగులో ట్రామా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో సెంటర్‌కు రూ.75 లక్షల నిధులను కేటాయించనున్నారు. మొత్తంగా రూ.4.26 కోట్లు నిధులు రానున్నాయి. అదనంగా కేంద్ర నిధులు కూడా వస్తాయి. ఈ నిధులతో భవనాలు, సిబ్బంది, పరికరాల ఏర్పాటు జరుగుతుంది.
సెంటర్ల ఏర్పాటు అభినందనీయం
తెలంగాణ ప్రభుత్వం 28 ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయం. ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వైద్యశాలల ఏర్పాటు చేయాలని ఇచ్చిన విజ్ఞప్తికి న్యాయం జరిగినట్లయింది. ఇందుకు సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్యమంత్రికి కృత్ఞజ్ఞతలు తెలుపుతున్నా.
– శానబోయిన రాజ్‌కుమార్, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ నిర్వాహకులు
మరణాల సంఖ్య తగ్గించవచ్చు..
ప్రతీ సంవత్సరం రోడ్డు ప్రమాదంలో 40 శాతం మంది చనిపోతున్నారు. ఎక్కువ జాతీయ రహదారులపైనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రామా కేర సెంటర్ల ద్వారా మరణాలను అరికట్టిన వారమవుతాం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం
– జలగం సుధీర్, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్
ఎంతగానో ఉపయోగపడుతుంది
ట్రామాకేర్ సెంటర్లు అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం జరుగుతుంది. చాలామందిని మరణం నుంచి తప్పించిన వారమవుతాం. 24 గంటల పాటు సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందుతుంది. అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి.
– డాక్టర్ గోపాల్, నర్సంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment