
వరంగల్: కన్నబిడ్డను కాలేజీకి పంపుదామని బయలుదేరిన ఆ తండ్రిని విధి కబలించింది. కళ్లముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుమార్తె గుండెలవిసేలా రోదించింది. తనను సాగనంపడానికి వచ్చి కానరానిలోకాలకు పోతివా.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూర్ సమీపంలోని 163 జాతీయ రహదారిపై మంగళవారం కంటైనర్ లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న రైతు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపురం(కె) చెందిన పోలిన శ్రీనివాసరావు (58) తన కుమార్తె పోలిన శృతిని హైదరాబాద్‌లోని కాలేజీకి పంపించేందుకు తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఇదే క్రమంలో 163 జాతీయ రహదారిపై ఇసార్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె శృతికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో ములుగు వెళ్తున్న వెంకటాపురం జెడ్పీటీసీ పాయం రమణ ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన శృతిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తన వాహనంలో తీసుకువచ్చి చికిత్స అందించారు.
సంఘటన స్థలాన్ని ఎస్సై ఇందయ్య పరిశీలించి కారులో ఇరుక్కుపోయి శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కు మారులు, కుమార్తె హైదరాబాద్‌లో బీటెక్ చదువుతోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment