
హైదరాబాద్: రోడ్డు ప్రమాదానికి కారణమయ్యానని భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్యహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఎల్‌బీనగర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి (30) వృత్తిరీత్యా వ్యాపారి. నగరంలో ఓ పని నిమిత్తం కారులో వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో దిల్‌సుఖ్ నగర్ నుంచి ఎన్టీఆర్ నగర్ లోని ఆద్య ఆస్పత్రికి వచ్చి కారును పార్కింగ్ చేశాడు. భయాందోళనతో ఉన్న అతను ఆస్పత్రి నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా..నగరంలో పని నిమిత్తం వెళ్లిన అతను మూసారాంబాగ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ క్రమంలో రితీష్‌రెడ్డిని బైకుపై ఇద్దరు వ్యక్తులు వెంబడించడంతో భయాందోళనకు గురయ్యాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన తనపై కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. రితీష్ రెడ్డి కారును ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు.
అతను కారు ప్రమాదం చేసి వచ్చాడని అక్కడివారికి చెబుతున్న క్రమంలోనే.. రితీష్‌రెడ్డి భవనంపై నుంచి దూకడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. రితీష్ రెడ్డికి 8 నెలల క్రితమే వివాహమైందని, ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రితీష్ రెడ్డిని వెంబడించినవారి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.