జోరందుకున్న సంక్రాంతి కొనుగోళ్లు
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో మార్కెట్లు సంక్రాంతి పండగ శోభను సంతరించుకున్నాయి. వస్త్రాల కొనుగోళ్లు రెండు రోజులుగా ముమ్మరమయ్యాయి. కోస్తా జిల్లాల్లో సంక్రాంతి అంటే కొత్త దుస్తులు ధరించాల్సిందే. ఈ సంవత్సరం పండగకు ముందే కళామందిర్, శ్రీనికేతన్ వంటి కార్పొరేట్ వస్త్రవ్యాపార సంస్థలు రాజమండ్రి, కాకినాడల్లో షోరూమ్‌లు ప్రారంభించాయి. ఇక హోల్‌సేల్ వస్త్రవ్యాపారానికి పేరొందిన రాజమండ్రి, ద్వారపూడిలలో అమ్మకాలు జోరందుకున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు కొత్త సరుకును రప్పిస్తున్నారు. రాజమండ్రిలో 800, ద్వారపూడిలో 600 హోల్ సేల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి.
మామూలు రోజుల్లో ఈ దుకాణాల్లో సుమారు రూ.కోటిన్నర వ్యాపారం జరుగుతుండగా పండగ సీజన్లో రోజుకు సగటున రూ.నాలుగు కోట్ల నుంచి రూ.ఐదు కోట్ల వ్యాపారం సాగుతుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిదివేల రిటైల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. వీటిలో మామూలు రోజుల్లో సుమారు రూ.పది కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందని, పండగ సీజన్లో అది రూ.35 కోట్లకు పైబడి ఉంటుందని వాపార వర్గాలు చెపుతున్నాయి. క్రిస్మస్ పండగతో డిసెంబర్ 15 నుంచి ఊపందుకునే అమ్మకాలు సంక్రాంతి ముందు తారస్థాయికి చేరతాయంటున్నారు.
జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కూడా పండగ కొనుగోళ్లకు రాజమండ్రి వస్తుంటారు. దీంతో రాజమండ్రి మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తాడితోట, మెయిన్ రోడ్లలో ఈ సందడి అధికంగా కనిపిస్తోంది. కాగా కాకినాడలో, కోనసీమ కేంద్రం అమలాపురంలో కూడా నాలుగు రోజులుగా పండగ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పండగ సీజన్ మొత్తమ్మీద జిల్లాలో కే వలం వస్త్ర వ్యాపారమే రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు జరుగుతుందని అంచనా. కాగా జిల్లాలో ఈ ఏడాది వస్త్ర వ్యాపారంలో 30 శాతానికి పైగా కార్పొరేట్ దుకాణాలే దక్కించుకోనున్నట్టు అంచనా.
వందలాదిగా వెలసిన ఫుట్‌పాత్ షాపులు
రాజమండ్రి, కాకినాడల్లో ఫుట్‌పాత్‌లపై దుస్తులు, ఫాన్సీ వస్తువులు అమ్మేవారికీ పండగతో అమ్మకాలు పెరిగాయి. బెంగాల్ కాటన్, పంజాబీ డ్రెస్సులు, రెడీమేడ్ దుస్తుల వంటివి విక్రయించే ఫుట్‌పాత్ షాపులు వందలాదిగా వెలశాయి. రాజమండ్రి, కాకినాడల్లో పండగ సీజన్లో ఫుట్‌పాత్ వ్యాపారం రోజుకు రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారాలకు కూడా జిల్లావ్యాప్తంగా గిరాకీ పెరిగింది. మామూలు రోజుల్లో కిరాణా వ్యాపారం రోజుకు రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుంది. క్రిస్మస్ లగాయతు సంక్రాంతి వరకూ ఇళ్లల్లో పిండి వంటలు ఎక్కువగా వండుతుంటారు. దుకాణాల్లో స్వీట్ల తయారీ కూడా రెట్టింపవుతుంది. వంటనూనెలు, పప్పు ధాన్యాలు, పంచదార వినియోగం పండగ సీజన్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. కాగా పండుగ సీజన్లో కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారం రూ.500 కోట్ల నుంచి రూ.750 కోట్ల వరకు ఉంటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
ధగధగలాడని పసిడి వ్యాపారం
కాగా బంగారం అమ్మకాలు మామూలు రోజులతో పోలిస్తే 15 నుంచి 20 శాతం మాత్రమే పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఈ సారి బంగారం ధర కూడా నిలకడగా ఉండడంతో జనం కొనుగోళ్లపై తాపీగా వ్యవహరిస్తున్నారు. 2012లో ఇదే కాలంలో 22 క్యారట్ల బంగారం గ్రాము రూ.2580 ఉండగా 24 క్యారట్ల బంగారం రూ.2820 ఉంది. 2013 జనవరిలో 22 క్యారట్ల బంగారం గ్రాము రూ.2839 ఉంటే 24 క్యారట్ల బంగారం రూ.3036 పలికింది. ప్రస్తుతం ఆ ధరలు రూ. 2770, రూ.2928 గా కొనసాగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధర తక్కువగా ఉన్నా సంక్రాంతికి జనం బంగారంపై కన్నా వస్త్రాల పైనే మక్కువ చూపుతారని వ్యాపారులు అంటున్నారు.