శాస్త్రోక్తంగా ‘సన్నిధి శుద్ధి’
· ప్రారంభించిన ఈఓ, జెఈఓ, అర్చకులు,
· ప్రధానాలయగోపురం వద్ద సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేకపూజలు
· గర్భాలయ, అంతరాలయగోడలకు సుగంధ లేపన పూత
· సుగంధ ద్రవ్యాలతో ఆలయప్రదక్షిణ
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో శుక్రవారం ‘సన్నిధి శుద్ధి’ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, అంతరాలయం, శనగల బసవన్న, ధ్వజస్తంభం, ఆలయ పరివారాలయాలన్నింటికీ సుగంధ ద్రవ్యలేపనం పూశారు. కర్పూరం, జాజికాయ, జాపత్రి, కస్తూరి, ఏలకులు, లవంగాలు, వట్టివేరు, చందనం, కుంకుమపువ్వు, కుంకుడు రసం తదితరవాటితో లేపనాన్ని తయారు చేసినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. ముందుగా ఈఓ నారాయణ గుప్త దంపతులు, జెఈఓ హరినాథ్‌రెడ్డి దంపతులు, అర్చకులు, వేదపండితులు ప్రధానాలయగోపురం వద్ద సుగంధ ద్రవ్యాలకు శాస్త్రోక్తంగా మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేకపూజలను నిర్వహించారు. ఆ తరువాత సుగంధ ద్రవ్యాలను తలపై పెట్టుకుని ఆలయప్రదక్షిణ చేసిన అనంతరం సన్నిధి శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయప్రాంగణం, అంతరాలయాలను అధికారులు శుద్ధి చేయగా, గర్భాలయాన్ని అర్చకులు శుద్ధి చేసి సుగంధ లేపనాన్ని పూతగా పూశారు. ధ్వజస్తంభం, ద్వారపాలకులు, ఆలయ శిల్పాలు, పంచలోహ, కాంస్య (కంచు)మూర్తులకు జలాలతో శుద్ధి చేసి సుగంధ లేపనాన్ని పూశారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఇలాంటి సుగంధలేపన కార్యక్రమం వైష్ణవాలయాలలో నిర్వహిస్తుంటారు. ప్రప్రథమంగా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఆలయప్రాంగణమంతా సుగంధ పరిమళాలను వెదజల్లుతుందని, భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలను అందిస్తుందనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు.