అరుణతారకు తుది వీడ్కోలు
ముగిసిన ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలు
శాంటియాగో డి క్యూబా: క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. వేలాది మంది ప్రజలు ‘వివా ఫిడెల్’ అనే నినాదాలు చేస్తుండగా.. ఇక్కడి శాంటా ఇఫిజెనియా శ్మశానంలోకి ఆయన చితాభస్మాన్ని ఉంచిన వాహనం ప్రవేశించింది. అక్కడ ఆయన చితాభస్మాన్ని సమాధి చేశారు. కాగా, శనివారం రాత్రి ఫిడెల్ సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో శాంటియాగో రివల్యూషన్ ప్లాజా వద్ద ఫిడెల్ గౌరవార్థం భారీ బహిరంగ సభ నిర్వహించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిడెల్ లేని భవిష్యత్లో తమ దేశాన్ని, సోషలిజాన్ని రక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ఆత్మవిశ్వాసమే పరమావధిగా క్యూబాలో సోషలిజాన్ని ఫిడెల్ పాదుగొల్పారని చెప్పారు. కాగా, ఫిడెల్ క్యాస్ట్రో వ్యక్తి పూజను తీవ్రంగా వ్యతిరేకించేవారు. తన తదనంతరం విగ్రహాలుగానీ, వీధులకు, భవంతులకు తన పేరు పెట్టడంగానీ చేయవద్దని కోరారు. ఆ కోరిక ప్రకారం క్యూబా ప్రభుత్వం త్వరలో సమావేశమై ఓ చట్టం చేయనుంది. నవంబర్ 25న ఫిడెల్ క్యాస్ట్రో మృతి చెందిన తర్వాత ఆయన చితాభస్మాన్ని వారం పాటు దేశవ్యాప్తంగా తిప్పారు. ఆయనకు నివాళులర్పించేందుకు ప్రజలు వీధుల్లో పోటెత్తారు.