కోటె మా గుండెల్లో ఉన్నారు
బెంగళూరు, న్యూస్‌లైన్ :అఖిల కర్ణాటక అన్న య్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటె వెంకటేశ్ యాదవ్ భౌతికంగా లేకపోయినా మా గుండెల్లో పదిలంగా ఉన్నారని వక్తలు పేర్కొన్నారు. ఇక్కడి కార్పొరేషన్ సమీపంలోని టౌన్హాల్లో శుక్రవారం రాత్రి కోటె వెంకటేశ్ సంతాపసభ జరిగింది. చిక్కపేట ఎమ్మెల్యే ఆర్.వీ. దేవరాజ్, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొందు రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరై కోటె వెంకటేశ్‌కు ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆర్.వీ. దేవరాజ్ మాట్లాడుతూ చిరంజీవి అభిమానుల సంఘాన్ని కర్ణాటకలో స్థాపించి ఎంతో సేవ చేశారన్నారు. కోటే కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామన్నారు. రవణం స్వామి నాయుడు మాట్లాడుతూ వెంకటేశ్ యాదవ్ దూరం కావడం నమ్మలేకపోతున్నామన్నారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో సేకరించి వెంకటేశ్ కుమారుడు కోటే శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసిన రూ. 6లక్షలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అందించారు.
అఖిల కర్ణాటక అనయ్య చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు సేకరించిన రూ. 1.30 లక్షలను కోటే కుటుంబ సభ్యులకు ఆర్వీ. దేవరాజ్, స్వామి నాయుడు అందించారు. బొందురామస్వామి మాట్లాడుతూ బెంగళూరులో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమాలలో వెంకటేశ్ పాల్గొన్నారన్నారు. ఇదే నెలలో గాంధీనగరలోని కనిష్క హొటల్లో కోటే వెంకటేశ్ యాదవ్ సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
వెంకటేశ్ కుటుంబ సభ్యులకు తాము చేతనైన సహాయం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా సంతాపసభకు హైదరాబాద్, అనంతపురం, బళ్లారి, బెంగళూరు, కోలారు, ముళబాగిలు, చిక్కబళ్లారం, చింతామణి తదితర ప్రాంతాలకు చెందిన అభిమానులతోపాటు చింతామణి మహేష్, మార్కండేయ, అంజి, రాజ్‌బాబు, నరసింహ, మార్టీన్, ఎన్. మురళి కళ్యాణ్, దాస్, బాబు, ప్రతాప్, సంతోష్, కలాసిపాళ్య దినేష్, బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, అంబరీష్‌రెడ్డి, అనంతపురం చంద్రమౌళి, జేడీఎస్ నారాయణ్, రామచంద్ర, బళ్లారి సాంబశివరావు, బళ్లారి రాజు, మొబైల్ బాబు హాజరయ్యారు.
అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడిగా కోటె సతీష్ ఏకగ్రీవం
అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోటే సతీష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆ సంఘం పదాధికారులు తెలిపారు. కోటే వెంకటేశ్ లేని లోటును ఆయన తమ్ముడు కోటే సతీష్ తీర్చుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈయనకు త్వరలోనే ధ్రువీకరణ పత్రం అందజేస్తామని రవణం స్వామినాయుడు హామీ ఇచ్చారన్నారు.