శిల్పా నిర్ణయాలతో టీడీపీకి ఇక్కట్లు
- శోభానాగిరెడ్డి సంతాప సభలపై అభ్యంతరం అనవసరం
- ఆరోపణలతో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం
నంద్యాల, న్యూస్‌లైన్ : ప్రజాభిమానమున్న నేతలపై అకారణంగా ఆరోపణలు చేస్తూ శిల్పా మోహన్‌రెడ్డి సొంతపార్టీ అయిన టీడీపీనే దెబ్బతీస్తున్నారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. దివంగత శోభానాగిరెడ్డి సంతాపసభలు నంద్యాలలో నిర్వహించడం, ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై శిల్పా రాద్ధాతం చేస్తున్నారు. ఆదివారం గోస్పాడు మండలంలోని జూలేపల్లె, తది తర గ్రామాల్లో, సోమవారం నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడారు.
శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డకు చెందిన నాయకురాలని, ఆమెకు నంద్యాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం తెలిసిన భూమా, శోభా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2004లో శోభానాగిరెడ్డి నంద్యాల పార్లమెంట్‌కు పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆమెకు 41 వేల ఓట్లు పోలయ్యాయని వివరిస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్‌గా నంద్యాల ఆర్టీసీ డిపోను ఆధునికీకరించడమే కాకుండా అత్యధిక సంఖ్య లో బస్సులను తెప్పించిన ఘనత ఆమెకే దక్కుతుందని తెలిపారు.
వ్యవసాయ పరిశోధనా కేంద్రం డెరైక్టర్‌గా పని చేసి అప్పట్లో అనేక కార్యక్రమాలను నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో చేపట్టారని తెలిపారు. శోభానాగిరెడ్డి హైదరాబాద్‌లో మృతి చెందిన తర్వాత ఆళ్లగడ్డకు అంత్యక్రియలకు తీసుకెళ్తూ నంద్యాలలో గంట సేపు ఉంచితే దాదాపు 40 వేల మంది చూసి నివాళి అర్పించారని పేర్కొన్నారు. అలాంటి నాయకురాలి సంతాపసభలను ప్రజలు స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారని, దానిని వద్దనే హక్కు ఎవ్వరికీ లేదని అంటున్నారు.
ఇప్పటికే శోభానాగిరెడ్డి అభిమానులు దాదాపు 100 మంది వారి వాహనాలకు ఆమె ఫొటోలు ఏర్పాటు చేసుకున్నారని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆ సంఖ్య మరింత పెరిగేలా ఉందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీడీపీపై ప్రజల్లో చులకన భావం ఉందని, అందుకే ప్రచారం చేసేందుకు కూడా సాధ్యపడడం లేదని తెలిపారు. అదే సమయంలో వైఎస్సార్సీపీపై సానుభూతి మరింత అధికమవుతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా శిల్పా తన పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.