ఆ.. 'మరణ' దీక్షకు అనుమతి మంజూరు
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన జైన మతస్తుల ఉపవాస దీక్షలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. జైనులు చేపట్టే సంతారా (నిరాహారదీక్షతో పరమపదించే ప్రక్రియ) ఆత్మహత్యతో సమానమని భావించిన కింది కోర్టులు ఆ ప్రకియను నిషేధించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన పిటిషన్ ను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు.. కింది కోర్లు తీర్పుపై స్టే ఇవ్వడంతోపాటు ఆమరణ దీక్షలు నిరాటంకంగా చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.
జైనుల మతాచారం అయిన సంతారాపై గతంలో రాజస్తాన్ హైకోర్టు నిషేదించడంపై ఆ మతస్తులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బంద్ ప్రభావంతో హైదరాబాద్ లోనూ దాదాపు 10 వేల దుకాణాలు మూతపడ్డాయి.
మోక్షం పొందడం కోసం తాము ఆచరించే సంతారాపై నిషేధం మతహక్కులకు భంగం కల్గించడమేనని నినదించిన జైనులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు మతాలలో ఉపవాస దీక్ష సంప్రదాయం ఉందని, అలాగే జైనులలో మరింత కఠినమైన దీక్ష చేస్తారని, మహావీరుడి కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉన్నదని, దానిని అనుమతించకపోవడం సరికాదని జైనుల వాదన.