అమ్మ కోలుకోవాలని పూజలు
పళ్లిపట్టు: అమ్మ ఆరోగ్యం కుదుటపడాలనే ఆశయంతో అన్నాడీఎంకే శ్రేణులు పూజలు కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్నారు. జయ ఆరోగ్యం పట్ల విభిన్న కథనాలు వెలువడుతున్న క్రమంలో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంటోంది. దీంతో అమ్మకు ఆ దేవుడే దిక్కనే విధంగా కార్యకర్తలు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రతిరోజూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పళ్లిపట్టు యూనియన్ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో కరింబేడు నాదాదీశ్వరాలయంలో బుధవారం విశిష్ట యాగ పూజలు నిర్వహించారు.
మండల కన్వీనర్ టీడీ.శ్రీనివాసన్ ఏర్పాటు మేరకు చేపట్టిన పూజల్లో ఎంపీ హరి, ఎమ్మెల్యే నరసింహన్, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల చైర్మన్ శాంతిప్రియాసురేష్, ఆవిన్ చైర్మన్ చంద్రన్ పాల్గొన్నారు. పొదటూరుపేట పట్టణ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో పట్టణంలోని 18 ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పార్టీ పట్టణ కన్వీనర్ నటరాజన్ ఆధ్వర్యంలో విశిష్ట అభిషేక ఆరాధన పూజలు చేపట్టి అమ్మ ఆరోగ్యం కోలుకోవాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే నరసింహన్ పాల్గొన్నారు. 17 వార్డులో ఆ పార్టీ న్యాయవాది ఢిల్లీ సమక్షంలో వినైతీర్కుం వినాయకర్ ఆలయంలో పూజలు నిర్వహించి అన్నదానం పంపిణీ చేశారు.
వేలూరులో..
వేలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్య కావాలని కోరు తూ అన్నాడీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, షోళింగర్ ఎమ్మెల్యే పార్తిబన్ ఆధ్వర్యంలో వాలాజ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో ప్రత్యేక యాగ పూజలు నిర్వహించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తె లిసిందే. అందులో భాగంగా ధన్వంతరి పీఠంలో రాణిపేట ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ బోస్ అధ్యక్షతన పూజలు చేశారు. ముందుగా పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామిజీ పీఠంలో అమ్మ పేరుపై గణపతి హోమం, ధన్వంతరి హోమం, కాల భైరవర్ హోమం పూజలతో పాటు పీఠంలోని స్వామి వారికి జయలలిత పేరుపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. మాజీ జిల్లా కార్యదర్శి ఏలుమలై, పట్టణ కార్యదర్శి వేదగిరి, డబ్ల్యూజీ మోహన్, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.