పారిశ్రామికాభివృద్ధికి బాటలు
కర్నూలు(కలెక్టరేట్): రాష్ట్ర విభజన నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. ఇందుకు అనువైన ప్రభుత్వ భూములు ఉండటంతో జిల్లాపై అందరి దృష్టి కేంద్రీకృతమవుతోంది. తగిన నీటి వసతి.. వివిధ రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారులు ఉండటం.. రైల్వే మార్గాలు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలమనే భావన వ్యక్తమవుతోంది. ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చనే వివరాలను కూడా ఇప్పటికే జిల్లా పరిశ్రమల శాఖ సిద్ధం చేసింది.
సిమెంట్ పరిశ్రమలు.. కాటన్ జిన్నింగ్ మిల్లులు.. గ్లాస్ ఇండస్ట్రీస్.. స్పాంజ్, ఐరన్ ప్లాంట్లు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. టెక్స్టైల్స్ పరిశ్రమలు.. ప్లాస్టిక్ ఇండస్ట్రీస్.. కోల్డ్ స్టోరేజీలు తదితరాల ఏర్పాటుకు జిల్లా అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది.
అందులో భాగంగానే ఓర్వకల్లు మండలం శకునాలలో ఇండస్ట్రియల్ పార్కును 2వేల ఎకరాల్లో నెలకొల్పేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ మేరకు శుక్రవారం ఏపీఐఐసీకి శుకునాలలో భూ కేటాయింపునకు కలెక్టర్ ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో ఏపీఐఐసీ అధికారులు రోడ్డు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి అవసరమైన భూమిని విక్రయించనున్నారు.
ప్రస్తుతం జిల్లాలో కర్నూలు, డోన్, ఆదోనిల్లో ఒక్కొక్కటి, నంద్యాలలో రెండు ప్రకారం ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఇకపోతే కల్లూరులో 103 ఎకరాలు, ఓర్వకల్లు మండలం నన్నూరులో 1,223 ఎకరాలు, ఓర్వకల్లులో 78 ఎకరాలు, కర్నూలు మండలం పంచలింగాలలో 38 ఎకరాలు, కల్లూరు మండలంలో లక్ష్మీపురంలో 127 ఎకరాలు, ఓర్వకల్లులో మరో చోట 356 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.
నంద్యాలకు చెందిన శాంతిరాం గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో సోలార్ పవర్‌ప్లాంట్ నెలకొల్పేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. వెయ్యి మెగా వాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి 5వేల ఎకరాల భూములు కేటాయించాలని ప్రభుత్వానికి ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి సంస్థ తమ ఫ్యాక్టరీకి రైల్వే లైన్ కోసం 349 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. సిమెంట్‌ను వ్యాగన్ల ద్వారా ఎగుమతి చేసేందుకు రైల్వే ట్రాక్ ఏర్పాటుపై దృష్టి జేఎస్‌డబ్ల్యూ దృష్టి సారించింది. కౌలూరు, కొండజూటూరు, కొరటమద్ది, చిలకలగూడూరు, గడిగరేవుల, దుర్వేసి, పెసరవాయి, బూజనూరు, తిరుపాడు గ్రామాల మీదుగా రైల్వే ట్రాక్‌కు అవసరమైన భూములు కేటాయించాలని ఆ సంస్థ యాజమాన్యం కోరినట్లు అధికారులు తెలిపారు.