Santos
-
మెస్సీ ప్రపంచ రికార్డు
బార్సిలోనా (స్పెయిన్): ఫుట్‌బాల్ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బార్సిలోనా స్టార్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లయనెల్ మెస్సీ బద్దలు కొట్టాడు. ఒకే క్లబ్ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా 33 ఏళ్ల మెస్సీ గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా 643 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డును గత ఆదివారం మెస్సీ సమం చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు బ్రెజిల్‌లోని సాంటోస్ క్లబ్ తరఫున ఆడిన పీలే 643 గోల్స్ సాధించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన స్పానిష్ లీగ్‌లో రియల్ వాలాడోలిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా జట్టు 3–0తో గెలిచింది. ఆట 65వ నిమిషంలో మెస్సీ గోల్ చేసి పీలే రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో మెస్సీ 2004 నుంచి బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పీలే 643 గోల్స్‌ను 757 మ్యాచ్‌ల్లో చేయగా... మెస్సీ 644 గోల్స్‌ను 749 మ్యాచ్‌ల్లో సాధించాడు. ఈ జాబితాలో గెర్డ్ ముల్లర్ (బయెర్న్ మ్యూనిక్–564 గోల్స్) మూడో స్థానంలో... ఫెర్నాండో పెరోటియో (స్పోర్టింగ్ లిస్బన్–544 గోల్స్) నాలుగో స్థానంలో... జోసెఫ్ బికాన్ (స్లావియా ప్రాగ్–534 గోల్స్) ఐదో స్థానంలో ఉన్నారు. -
సింగిల్స్ కోచ్‌గా సొంటోసో
న్యూఢిల్లీ: ఒలింపిక్ ఏడాది నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన అగుస్ డ్వి సాంటోసోను ఎంపిక చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జి హ్యూన్ వెళ్లడంతో ఏర్పడిన కోచ్ ఖాళీని భర్తీ చేయాలంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గతంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరింది. దానిపై స్పందించిన మంత్రిత్వ శాఖ సాంటోస్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడు ఒలింపిక్స్ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించనున్నాడు. సాంటోస్ మార్చి రెండో వారంలో భారత బ్యాడ్మింటన్ జట్టుతో కలుస్తాడు. అతడి పర్యవేక్షణలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు ఇతర సింగిల్స్ షట్లర్లు కూడా టోక్యో కోసం సిద్ధమవుతారు. సాంటోస్ శిక్షణతో సంతృప్తి చెందితే అతడిని 2024 వరకు కూడా కొనసాగిస్తామని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపారు. ఒలింపిక్స్ వరకు సొంటోసోకు నెలకు 8 వేల డాలర్లు (సుమారు రూ.5.8 లక్షలు ) చెల్లించనున్నారు. -
గ్యాస్ బ్లాక్‌ల నుంచి వైదొలగనున్న శాంటోస్
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం బీహెచ్పీ బిలిటన్ బాటలోనే ఆస్ట్రేలియాకి చెందిన మరో సంస్థ శాంటోస్ రెండు చమురు, గ్యాస్ బ్లాకుల నుంచి వైదొలగాలని యోచిస్తోంది. అనుమతుల్లో జాప్యాల కారణంగా పనులు ప్రారంభం కాకపోవడమే ఇందుకు కారణం. రక్షణ శాఖ ఆంక్షలు, బంగ్లాదేశ్‌తో సరిహద్దు వివాదాలు మొదలైన వాటి వల్ల ఇంధన అన్వేషణ కార్యకలాపాలు సాగించలేకపోతున్నామంటూ ప్రభుత్వానికి రాసిన లేఖలో శాంటోస్ పేర్కొంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ శాంటోస్.. 2007 ఫిబ్రవరిలో ఈ బ్లాకులను దక్కించుకుంది. వీటిపై సంస్థ ఇప్పటికే శాంటోస్ 6 కోట్ల డాలర్లు వెచ్చించింది. రక్షణ శాఖ అనుమతుల జాప్యంతో అక్టోబర్‌లో బీహెచ్పీ సైతం పది ఆయిల్, గ్యాస్ బ్లాకుల్లో తొమ్మిదింటి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.