మృత్యువుతో పోరాడి కోలీ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: సీమాపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా బరిలో ఉన్న సంతోష్ కోలీ బుధవారం ఉదయం మరణించారు. జూన్ 30న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ కోలీ తలకు తీవ్ర దెబ్బ తగలడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి మెదడులో రక్తం గడ్డకట్టడం(బ్రెయిన్ హేమరేజ్)తో పరిస్థితి విషమించింది. ఆమె ఉదయం గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో ఆప్ కార్యకర్తలు పలువురు గుర్గావ్లోని ఆసుపత్రిలోనే ఉన్నారు. సంతోష్ కోలీ మరణం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ సంతాపాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
ఆమె ఆత్మకు శాంతి లభించాలని కోరుతూ ఆమె పోరాటాన్ని తాము కొనసాగిస్తామన్నారు. ఈశాన్య ఢిల్లీలోని ఓ పేద కుటుంబానికి చెందిన సంతోష్ 2002 నుంచి కేజ్రీవాల్‌తో కలిసి ఆయన సారథ్యంలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేశారు. ప్రజాదరణ కలిగిన సంతోష్ ఆమ్ ఆద్మీ పార్టీ వీధులలో నిర్వహించే ప్రదర్శనలకు జనాలను సమీకరించేవారు. అధిక విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిరాహార దీక్ష నిర్వహించిన సమయంలో ఆయన సుందర్ నగరీలోని కోలీ ఇంట్లోనే ఉన్నారు. కోలీ తండ్రి దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే సంతోష్ కోలీ పని తీరును గుర్తించిన ఆమ్ ఆద్మీ పార్టీ సీమాపురి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన తరువాత సంతోష్‌కు ఎన్నికలలో పోటీచేయరాదని ఫోన్లో బెదిరిం పులు వచ్చాయని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే జూన్ 30 సాయంత్రం పార్టీ సభ్యుడైన కుల్దీప్తో కలిసి బుల్లెట్‌పై వెళుతుండగా కౌశంబీ మెట్రో స్టేషన్ వద్దనున్న పసిఫిక్మాల్ ఎదురుగా ఎరుపు రంగు ఎస్యూవీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీని తాకిడికి బుల్లెట్లో మంటలు కూడా చెలరేగాయి. సంతోష్ మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో 37 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సంతోష్ కన్నుమూశారు.
ప్రమాదంపై అనుమానాలు
సంతోష్ కోలీకి జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆప్ పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అంటున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రమాదతీరు కారణంగా పోలీసులు కూడా గుర్తుతెలియని వ్యక్తులపై హత్యాయత్నం కింద కేసు నమోదుచేశారు. అయితే ఇప్పటివరకు నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. సంతోష్‌కు జరిగింది మామూలు రోడ్డు ప్రమాదం కాదని, అది ఆమె ప్రాణాలు తీయడం కోసం జరిగిన దాడి అని ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. సంతోష్‌ను చంపాలన్న కుట్రతోనే ఆమె వాహనాన్ని ఢీకొట్టారని అన్నారు. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తముందని కూడా ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే తనను బెదిరించినట్లు సంతోష్ తెలిపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్‌పై పథకం ప్రకారం దాడి జరిగిందని మరొక నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. దీనిపై ఆప్ నేతలు లింక్ రోడ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేశారు.