sanyasinayudu
-
పోలీసు వలపు వేధింపులు..!
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారే లైంగిక వేధింపులకు పాల్ప డ్డారనే ఆరోపణలు నగరంలో కలకలం రేపాయి. ప్రేమించి మోసపోయిన తన సోదరి పెట్టిన కేసు పురోగతిపై వాకబు చేసేందుకు యత్నించిన బాధితురాలి సోదరితో ఫోన్లో ఎంవీపీ సీఐ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ ఘటనపై బాధితులు, మహిళా చేతన సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్ – 9 గొల్లవీధిలో తల్లి, చెల్లితో నివసిస్తున్న పల్లా కృష్ణకుమారి ఆం ధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. ఆమెను వరుసకు బావ అయ్యే విజయభాస్కర్ ప్రేమ పేరుతో వంచించి లైంగికంగా లొంగదీ సుకున్నాడని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యా దు చేసింది. ఫిర్యాదు అందిన తరువాత సదరు యువకుడు విజయభాస్కర్‌ని సీఐ పిలి పించి చర్యలు తీసుకోలేదని, పైగా కృష్ణకుమారి సోదరి మీనాక్షికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. మీనాక్షికి సీఐ సన్యాసినాయుడు ఫోన్‌చేసి.. ఎక్కడ ఉంటున్నారు..?, ఏం చదువుతున్నావు..? ఇంటి అద్దె ఎంత అం టూ వ్యక్తిగత వివరాలు అడగారని, ఏ టైమ్‌లో ఫ్రీగా ఉంటావు..? బీచ్‌కి ఎప్పుడు వస్తావు, ఇద్దరం ఒకే కేస్ట్ కదా.. అంటూ సీఐ లైంగికంగా వేధించారని మీనాక్షి ఆరోపించింది. తన అక్కకి అలా జరిగిందని, తాను కూడా అలాంటిదాన్నే అని భావిస్తున్నారా అని సీఐని ప్రశ్నించినా చులకనగా మాట్లాడారని మీనాక్షి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మహిళా చేతన కార్యదర్శి పద్మను ఆశ్రయించగా ఆమె సోమవారం ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడారు. బాధితురాలు మీనాక్షితో కలిసి సీఐని నిలదీయగా... మొదట బుకాయించినప్పటికీ ఆడియో రికార్డింగ్‌ను వినిపించడంతో సీఐ కాళ్ల బేరానికి వచ్చాడని పద్మ మీడియాకు తెలిపారు. ఇటువంటి సీఐపై సీపీ మహేష్‌చంద్ర లడ్డా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆమె బాధితులతో కలిసి ద్వారకా సబ్ డివిజన్ ఏసీపీ వై.వి.నాయుడుని కలిసి ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండీ మహిళలతో చులకనగా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. సన్యాసినాయుడుపై సీపీ కొరడా ఎంవీపీ సీఐ ఎన్.సన్యాసినాయుడుపై సీపీ కొరడా ఝులిపించారు. ప్రేమించి మోసపోయానని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సోదరి మీనాక్షి పట్ల ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు అందడంతో సీపీ మహేష్‌చంద్రలడ్డా ఎంవీపీ సీఐని సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడి త్రీటౌన్ స్టేషన్ సీఐ బెండి వెంకటరావు కూడా ఒక బాధితురాలితో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు రావడంతో అప్పటి సీపీ యోగానంద్ వెంటనే స్పందించి సీఐ వెంకటరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆయనకు శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇచ్చారు. సీఐ సన్యాసినాయుడు మోసగాడిని అరెస్ట్ చేయాలి ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి మరో అమ్మాయితో వివాహానికి సిద్ధపడుతున్న మోసగాడిని అరెస్ట్ చేయాలని మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ, బాధితురాలు కృష్ణకుమారి డిమాండ్ చేశారు. పద్మతో కలిసి ఎంవీపీ పోలీసు స్టేషన్ ఆవరణలో కృష్ణకుమారి మీడియాతో సోమవారం మాట్లాడారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నానని, తల్లి, చెల్లితో కలిసి ఎంవీపీ కాలనీ సెక్టార్ – 9 గొల్లవీధిలో నివసిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ జియ్యమ్మవలస మండలం పరసవాడు దరి లక్ష్మీపురం గ్రామానికి చెందిన మేనమామ మన్మథనాయుడు కుమారుడు తాడేల విజయభాస్కర్, తాను ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నామన్నారు. తామిద్దరం ఢిల్లీ, బెంగళూరు, తిరుపతి పట్టణాలు తిరిగామన్నారు. విజయభాస్కర్ బెంగళూరులోని ఫార్చ్యూన్ సమ్మిట్ ట్రావెల్ సెంట్రిక్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడన్నారు. మీడియాతో మాట్లాడుతున్న మహిళా చేతన కార్యదర్శి పద్మ తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు బావ తనను మభ్యపెట్టి లైంగికంగా లోబరుచుకున్నాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖ, తిరుపతి పట్టణాలలోని హోటల్స్‌లో కూడా లోబరచుకున్నాడన్నారు. గత ఏడాది నుంచి తనకు ముఖం చాటేస్తున్నాడని విచారం వ్యక్తం చేశారు. తన మేనమామకు విషయం అంతా చెప్పినా సరే పెళ్లికి అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎంవీపీ కాలనీలో నివసిస్తున్న మరో యువతితో విజయభాస్కర్ వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడన్నారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్చి 9న వాయిదా పడిన నిశ్చితార్థం ఈ నెల 27న ఒక హోటల్లో రహస్యంగా నిర్వహించారన్నారు. తనకు అన్యాయం చేసిన విజయభాస్కర్‌ని అరెస్ట్ చేయాలని, మేనమామపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మహిళా చేతన నాయకులు కూడా పాల్గొన్నారు. -
ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందే..
పార్వతీపురం: పాచిపెంట మండలం రాయగడ్డివలస పంచాయతీ కొండతాడూరుకు చెందిన సుర్రు అప్పలస్వామిపై దాడి చేసిన ఎస్సై సన్యాసినాయుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్రామస్తులు, గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు పార్వతీపురం ఆర్డీఓ సుదర్శనదొరకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని మాతుమూరి గ్రామానికి చెందిన పెత్తందారు మరడ పోలినాయుడు అక్రమించాడన్నారు. అడిగిన గిరిజనులపై దాడులు చేయిస్తున్నాడని, ఈ విషయాన్ని తహసీల్దార్, ఆర్డీఓల దృష్టికి తీసుకురాగా అధికారులు సర్వే చేశారన్నారు. ఇందులో 209 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దీంతో ఆ భూమిని గిరిజనులు సాగు చేసుకోవచ్చని అధికారులు చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం పలువురు గిరిజనులు భూమి వద్దకు వెళ్లగా పోలినాయుడు వచ్చి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత పాచిపెంట ఎస్సై కొండతాడూరు వెళ్లి అక్కడ పశువులు మేపుతున్న సుర్రు అప్పలస్వామిని గిరిజనులు సాగు చేస్తు న్న భూమి ఎక్కడ అని అడగ్గా, అతను తెలియదని సమాధానం చెప్పడంతో ఎస్సై ఇష్టానుసారంగా కొట్టారని ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. తర్వాత ఎస్సై కొండతాడూరు వెళ్లి గిరిజనులను బెదిరించారని తెలిపారు. ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, గిరిజన సంఘ నాయకులు దుక్కు సీతారాం, రుఘుపతుల శశిభూషణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సై ఓవరాక్షన్..
సాలూరురూరల్ (పాచిపెంట): పాచి పెంట ఎస్సై సన్యాసినాయుడు ఓవరాక్షన్ కారణంగా ఒక గిరిజనుడు ఆస్పత్రి పాలుకా గా, సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు.. మాతుమూరు గ్రామానికి చెందిన మరడ రవణమ్మకు కొండతాడూరులో కొంత భూమి ఉంది. ఈ భూమిలో గిరిజనులు, సీపీఎం నాయకులు ఆదివారం ఎర్రజెండాలు పాతారు. దీంతో విషయం తెలుసుకున్న రవణమ్మ తన భూమిలో జెండాలు పాతిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్సై సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న పశువుల కాపరి సుర్రు అప్పలస్వామి, స్థానికులు పొడిజన్ని లక్ష్మి, పొడిజన్ని సురేష్, తదితరులను విచారించారు. అయితే వీరు విషయం సక్రమంగా చెప్పకపోవడంతో పశువుల కాపరి అప్పలస్వామిని ఎస్సై కొట్టాడు. అప్పలస్వామి అపస్మారకస్థితికి చేరుకోవడంతో స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు. విధులకు అడ్డుతగిలారు.. ఇదిలా ఉంటే విచారణకు వెళ్లిన తమపై సుర్రు అప్పలస్వామి, పొడిజన్ని లక్ష్మి, పొడిజన్ని సురేష్, చింత సీతయ్యలు ఎదురుదాడికి దిగారని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎస్సై తీరు సరికాదు.. రాయిగుడ్డివలస సర్పంచ్ సీతయ్య విలేకరులతో మాట్లాడుతూ, బాధిత గిరిజనులకు అండగా నిలవాల్సిన ఎస్సై భూకామాంధులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపించారు. సీపీఎం నాయకులతో కలిసి గిరిజనులు ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు పాతారన్నారు. అయితే ఎస్సై భూకామాంధులకు ఒత్తాసు పలుకుతూ అభం..శుభం తెలియని పశువుల కాపరి అప్పలస్వామిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఎస్సై దాడిలో గాయపడిన అప్పలస్వామిని స్థానికులు సాలూరు సీహెచ్‌సీకి తరలించారని తెలిపారు. ఇదిలా ఉంటే సంఘటనా స్థలంలో లేకపోయినా, పరామర్శకు వచ్చాననే అక్కసుతో ఎస్సై తనపై కూడా కేసు నమోదు చేశాడని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవడంతో పాటు భూమిలేని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. -
స్నేహ బంధం తెగింది
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం అతని ఇద్దరు స్నేహితులకు గాయాలు స్నేహితుల దినోత్సవం నాడు విషాదం మాకవరపాలెం : స్నేహితుల దినోత్సవం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. స్నేహితుల్లో ఒకరిని శాశ్వతంగా దూరం చేసింది. ఈ సంఘటనతో తోటి స్నేహితులు, వారి తల్లిదండ్రులకు వేదనను మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని పైడిపాలకు చెందిన ఆడారి శ్రీనివాసరావు(25), వెంకటాపురానికి చెందిన మర్రి సన్యాసినాయుడు(25), జంగాలపల్లికి చెందిన ఎస్.గణేష్(26)లు స్నేహితులు. వీరు డిగ్రీవరకు నర్సీపట్నంలో కలిసి చదువుకున్నారు. ప్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం ముగ్గురూ మోటారు సైకిల్‌పై నర్సీపట్నం వచ్చారు. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తుండగా కొండలఅగ్రహారం గ్రామ శివారున ఉన్న సర్పానది వంతెన వద్దకు వెళ్లే సరికి బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో శ్రీనివాసరావుకు తలపైన, సన్యాసినాయుడుకు నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. గణేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. 108లో వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టోల్గేట్లో పని చేస్తున్న శ్రీనివాసరావు, సన్యాసినాయుడు మూడు రోజుల క్రితం స్వగ్రామాలకు వచ్చారు. ఇంతలో శ్రీనివాసరావు మృతి చెందడంతో తల్లిదండ్రులతోపాటు, తోటి స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.