ఆర్డీఓతో మాట్లాడుతున్న గిరిజనులు
పార్వతీపురం: పాచిపెంట మండలం రాయగడ్డివలస పంచాయతీ కొండతాడూరుకు చెందిన సుర్రు అప్పలస్వామిపై దాడి చేసిన ఎస్సై సన్యాసినాయుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్రామస్తులు, గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు పార్వతీపురం ఆర్డీఓ సుదర్శనదొరకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని మాతుమూరి గ్రామానికి చెందిన పెత్తందారు మరడ పోలినాయుడు అక్రమించాడన్నారు.
అడిగిన గిరిజనులపై దాడులు చేయిస్తున్నాడని, ఈ విషయాన్ని తహసీల్దార్, ఆర్డీఓల దృష్టికి తీసుకురాగా అధికారులు సర్వే చేశారన్నారు. ఇందులో 209 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దీంతో ఆ భూమిని గిరిజనులు సాగు చేసుకోవచ్చని అధికారులు చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం పలువురు గిరిజనులు భూమి వద్దకు వెళ్లగా పోలినాయుడు వచ్చి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత పాచిపెంట ఎస్సై కొండతాడూరు వెళ్లి అక్కడ పశువులు మేపుతున్న సుర్రు అప్పలస్వామిని గిరిజనులు సాగు చేస్తు న్న భూమి ఎక్కడ అని అడగ్గా, అతను తెలియదని సమాధానం చెప్పడంతో ఎస్సై ఇష్టానుసారంగా కొట్టారని ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. తర్వాత ఎస్సై కొండతాడూరు వెళ్లి గిరిజనులను బెదిరించారని తెలిపారు. ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, గిరిజన సంఘ నాయకులు దుక్కు సీతారాం, రుఘుపతుల శశిభూషణ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment