ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుర్రు అప్పలస్వామి
సాలూరురూరల్ (పాచిపెంట): పాచి పెంట ఎస్సై సన్యాసినాయుడు ఓవరాక్షన్ కారణంగా ఒక గిరిజనుడు ఆస్పత్రి పాలుకా గా, సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు.. మాతుమూరు గ్రామానికి చెందిన మరడ రవణమ్మకు కొండతాడూరులో కొంత భూమి ఉంది. ఈ భూమిలో గిరిజనులు, సీపీఎం నాయకులు ఆదివారం ఎర్రజెండాలు పాతారు. దీంతో విషయం తెలుసుకున్న రవణమ్మ తన భూమిలో జెండాలు పాతిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్సై సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న పశువుల కాపరి సుర్రు అప్పలస్వామి, స్థానికులు పొడిజన్ని లక్ష్మి, పొడిజన్ని సురేష్, తదితరులను విచారించారు. అయితే వీరు విషయం సక్రమంగా చెప్పకపోవడంతో పశువుల కాపరి అప్పలస్వామిని ఎస్సై కొట్టాడు. అప్పలస్వామి అపస్మారకస్థితికి చేరుకోవడంతో స్థానికులు సాలూరు ఆస్పత్రికి తరలించారు.
విధులకు అడ్డుతగిలారు..
ఇదిలా ఉంటే విచారణకు వెళ్లిన తమపై సుర్రు అప్పలస్వామి, పొడిజన్ని లక్ష్మి, పొడిజన్ని సురేష్, చింత సీతయ్యలు ఎదురుదాడికి దిగారని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఎస్సై తీరు సరికాదు..
రాయిగుడ్డివలస సర్పంచ్ సీతయ్య విలేకరులతో మాట్లాడుతూ, బాధిత గిరిజనులకు అండగా నిలవాల్సిన ఎస్సై భూకామాంధులకు అండగా నిలుస్తున్నాడని ఆరోపించారు. సీపీఎం నాయకులతో కలిసి గిరిజనులు ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు పాతారన్నారు. అయితే ఎస్సై భూకామాంధులకు ఒత్తాసు పలుకుతూ అభం..శుభం తెలియని పశువుల కాపరి అప్పలస్వామిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఎస్సై దాడిలో గాయపడిన అప్పలస్వామిని స్థానికులు సాలూరు సీహెచ్‌సీకి తరలించారని తెలిపారు. ఇదిలా ఉంటే సంఘటనా స్థలంలో లేకపోయినా, పరామర్శకు వచ్చాననే అక్కసుతో ఎస్సై తనపై కూడా కేసు నమోదు చేశాడని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవడంతో పాటు భూమిలేని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment