అనుకున్న సమయానికే తాత్కాలిక సచివాలయం
మంత్రి నారాయణ వెల్లడి
తుళ్లూరు : ఎల్అండ్టీ సంస్థ, షాపోజీ పల్లోంజి సంస్థలు నిర్విరామంగా శ్రమిస్తూ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలో జరుగుతున్న సచివాలయ నిర్మాణ పనులను శుక్రవారం నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అత్యవసరంగా నిర్మించేందుకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు.
మూడు నెలల్లో సచివాలయం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఒప్పందం ప్రకారం అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పనులు పూర్తిచేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రోజుల వ్యవధిలోనే భూమి లోపల నిర్మాణాలు పూర్తిచేశారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంస్థలు పనులను పరిశీలించేందుకు రెండు, మూడురోజులకోసారి వచ్చి వెళ్తున్నాయని, ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా, అత్యవసర కారణాలతో రాలేకపోయారన్నారు. మంత్రి వెంట మాజీమంత్రి గల్లా అరుణకుమారి, గ్రంథి చిరంజీవి, బెజవాడ నరేంద్ర, దండమూడి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.