సుప్తవర్ణం
►వారం క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు
►ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలపై వారంలో రోజుకో రంగు బార్డర్లున్నవి మార్చాలి
►రెండు రోజులైనా మార్చని వైనం
►గాడితప్పిన ప్రభుత్వ వినూత్న కార్యక్రమం
►పట్టించుకోని ఆస్పత్రుల ఉన్నతాధికారులు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు కార్యక్రమం గాడితప్పుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. వారంలో రోజుకో రంగు బార్డర్లు ఉన్న దుప్పట్లను క్రమం తప్పకుండా రోగుల పడకలపై మార్చాలి. జిల్లాలో అత్యంత పేరు ప్రఖ్యాతలున్న ఆస్పత్రుల్లో కూడా ఈ కార్యక్రమం అటకెక్కింది. రెండు రోజులకోసారి కూడా దుప్పట్లను మార్చడం లేదు.
తిరుపతి (అలిపిరి): స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. ముఖ్య మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులు గడవక ముందే స్వచ్ఛత కనుమరుగవుతోంది. రోజుకో రంగు ఉన్న బార్డర్లతో ఏడు రోజు లు వేర్వేరు దుప్పట్లు మార్చే కార్యక్రమాన్ని మే 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మరీ దుప్పట్లు మార్చే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సీఎం ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో పాటు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అ«ధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి సూచించిన వారం రోజులలోపే స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు కార్యక్రమం అభాసుపాలైంది. వైద్యుల నిక్ష్యం కారణంగా తిరుపతిలోని రుయా, స్విమ్స్, ప్రసూతి ఆసుపత్రి మొదలు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలకు నోచుకోవడం లేదు. రెండు రోజులైనా ఒక రంగు బార్డర్ ఉన్న దుప్పట్లే ఆసుపత్రుల్లో దర్శనమిస్తున్నాయి.
అవగాహన బోర్డులు ఎక్కడ?
ఆసుపత్రుల్లోని వార్డుల్లో రోజువారి మార్పుచేసే దుప్పట్ల రంగుల వివరాలు తెపిపే అవగాహన బోర్డులు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు కార్యక్రమం ప్రారంభం రోజున జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రంగులను తెలిపే బ్యానర్లను గోడలకు అంటించారు. కార్యక్రమం అయిన తరువాత వాటిని అక్కడి నుంచి తొలగించారు. శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ఆస్పత్రిలో దుప్పట్ల మార్పు కార్యక్రమం అమలు కావడం లేదు. ఏ రోజు ఏ రంగు దుప్పటి వేస్తారో అక్కడి సిబ్బందికే అర్థం కావడం లేదు. స్విమ్స్‌లోనూ ఈ కార్యక్రమం పేలవంగా అమలవుతోంది. ఇక ప్రసూతి ఆస్పత్రిలో స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల కార్యక్రమం ఒకటుందా అన్నవిధంగా కార్యక్రమం సాగడం లేదు. ఆధ్యాత్మిక క్షేత్రం, నిత్యం వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే తిరుపతిలోనే వినూత్న కార్యక్రమం ఇలా అమలవుతుంటే ఇక జిల్లావ్యాప్తంగా ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అధికారులు పర్యవేక్షణ లోపం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ ఆస్పత్రులకు స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయినా ఆస్పత్రుల ఉన్నతాధికారులు వార్డుల్లో పర్యవేక్షణ లోపం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల మార్పు కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. ఇకనైన ఆసుప్రతుల ఉన్నాధికారులు స్వచ్ఛత కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేసి రోగులకు మెరుగైన సదుపాయలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవీ నిబంధనలు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకో రంగు బార్డర్ ఉన్న దుప్పట్లను క్రమం తప్పకుండా రోగుల బెడ్లపై మార్చాలి. ఏ రోజు దుప్పటి మార్చకపోయినా రోగులు అక్కడి సిబ్బందిని ప్రశ్నించవచ్చు. నేరుగా ఆస్పత్రి కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కార్యక్రమం ఇండియన్ రైల్వే మార్గదర్శకాలను అనుసరించి అమలుచేస్తున్నారు. సోమవారం ఊదా, మంగళవారం ఆరెంజ్, బుధవారం మెజెంతా, గురువారం ఆకుపచ్చ, శుక్రవారం ఇటుక రంగు, శనివారం నీలిరంగు, ఆదివారం పసుపు రంగు బార్డర్లు ఉన్న దుప్పట్లు తప్పనిసరిగా మార్చాలి. రోగులకు పడకల ద్వారా ఎటువంటి వైరస్లు.. బ్యాక్టీరియాలు సోకకుండా రోగి మరింత అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకే దుప్పట్ల మార్పు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.