జలావాసం వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి, న్యూస్‌లైన్: కర్నూలు జిల్లాలో సప్తనదీ సంగమేశ్వర ఆలయం జలావాసం నుంచి బయటపడుతోంది. కొద్దిరోజుల్లో ఇక్కడ పూజలు నిర్వహించే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం తగ్గుతుండడంతో బుధవారం నాటికి గర్భాలయ శిఖర రాతి కలశం, మూడు మెట్ల వరుసలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 859-860 అడుగులుంది. నీటిమట్టం 834 అడుగులకు తగ్గితే సప్తనదీ శ్రీలలితా సంగమేశ్వరుడి నిజదర్శనం భక్తులకు కనువిందు చేయనుంది. ఈ ఆలయం ఏడాదిలో ఎనిమిది నెలలపాటు జలావాసంలోనే ఉంటుంది. ఇక్కడ సంగమేశ్వరస్వామి వేప శివలింగంలో వెలిశారు.