శారదా చిట్‌ఫండ్స్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
ఐదు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది మదుపుదారుల నెత్తిన టోపీ పెట్టి, వాళ్లందరినీ దివాలా తీయించిన శారదా చిట్‌ఫండ్స్ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ పనిచేస్తుంది. పశ్చిమబెంగాల్, ఒడిషా, బీహార్ రాష్ట్రాలకు చెందిన సీబీఐ అధికారులు ఇందులోభాగంగా ఉంటారు. శారదా చిట్ ఫండ్ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలుచేసే ముందు సంబంధిత పత్రాలన్నింటినీ సిట్ సేకరిస్తుందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
తీవ్ర రాజకీయ దుమారానికి కూడా కారణమైన ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 9వ తేదీన సీబీఐకి అప్పగించింది. పశ్చిమబెంగాల్, ఒడిషా, త్రిపుర, జార్ఖండ్, అసోం రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ఈ స్కాము కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు. చిట్‌ఫండ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించడంతో శారదా గ్రూపు చైర్మన్ సుదీప్త సేన్‌కు కోల్‌కతాలోని ఓ ఓ కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది.