రోడ్డు ప్రమాదంలో ప్రముఖ స్విమ్మర్ దుర్మరణం
రియోడిజనిరో: అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి గురై బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ స్మిమ్మర్ సారా కొరియా మృతిచెందింది. 2011లో జరిగిన పాన్ అమెరికన్ క్రీడల్లో స్విమ్మింగ్ విభాగంలో వెండిపతకాన్ని గెలుచుకుంది. శనివారం ఓ బస్సు స్టాప్ వద్ద ఆమె వెయిట్ చేస్తుండగా అతి వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొని వెళ్లిపోయింది. ఆమెను హుటాహుటిన సమీపంలోని మైగెల్ కోటో అనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆమె తల్లి మేరియా ఫాతిమా అల్వెస్ గోంకావెస్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించినట్లు ఓ మీడియా తెలిపింది. కాగా, తన కూతురును ఎవరో కావాలనే హత్య చేసినట్లు తల్లి ఫాతిమా ఆరోపించింది. తనకు న్యాయం జరిగేవరకు విశ్రమించబోనని ఆమె అన్నారు. సారా గత అక్టోబర్‌లోనే స్మిమ్మింగ్ నుంచి రిటైర్ అయ్యి మోడలింగ్‌పై దృష్టిని సారించి అకాల మరణం పొందింది.