ఏమిటీ సరా..?
కొద్ది రోజులుగా సరా (sarahah) యాప్ పేరు మార్మోగుతోంది. ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాల్లో విడుదలైన ఈ యాప్ అకస్మాత్తుగా భారత మార్కెట్లో హల్చల్ చే స్తూ.. చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ దీని కథేమిటో తెలుసా..?
మెసెంజింగ్ యాప్
సరా యాప్ మెసేజ్ సెండింగ్, రిసీవింగ్ కోసం రూపొందించినది. అలా అని జీమెయిల్ లాంటిది కాదు. మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుంటే దాన్ని చూసి మీకు ఎవరైనా ఫీడ్ బ్యాక్ పంపించే యూనిక్ ఫీచర్‌తో వచ్చిన యాప్. ఆకాశరామన్న ఉత్తరాల్లాగా అజ్ఞాత వ్యక్తి ఫీడ్‌బ్యాక్, కామెంట్స్ ఈ యాప్ ప్రత్యేకం. ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల్లో లభిస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే..?
మెయిల్ ఐడీ, సోషల్ మీడియా అకౌంట్ మాదిరిగానే సరా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ఎవరైనా చూసే విధంగా ఉంటుంది. అంతేకాక ఇతరులు లాగిన్ కావల్సిన అవసరం కూడా లేకుండా ప్రొఫైల్‌ను చూడటమే కాదు.. మెసేజ్‌లు కూడా పంపవచ్చు. అలాగే అవతలి వ్యక్తి లాగిన్ అయితే వాళ్ల మెసేజ్‌లను మీరు ట్యాగ్ చే సుకోవచ్చు. మీ ప్రొఫైల్‌ను ఆధారంగా చేసుకుని అవతలి వ్యక్తి మీకు కామెంట్స్ పంపవచ్చు. రిసీవర్ యాప్‌లోని ఇన్‌బాక్స్‌లో మీకు నచ్చిన మెసేజ్‌లు చూసుకోవచ్చు. వాటిని ఫ్లాగ్ చేసుకోవచ్చు లేదా తొలగించవచ్చు. సమాధానం కూడా ఇవ్వొచ్చు. నచ్చినవాటిని ఫేవరెట్‌గా పెట్టుకోవచ్చు.
భిన్నాభిప్రాయాలు
తక్కువ సమయంలో ప్రజాదరణ సంపాదించినా ఈ యాప్ పనితీరుపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫైల్‌ను సెర్చ్ నుంచి తొలగించడం, ఆడియన్స్‌ను పరిమితం చేయడం, అనాథరైజ్ యూజర్లు మీ ప్రొఫైల్‌ను షేర్ చేయకుండా, లాగిన్ కాకుండా కామెంట్ చేయలేని విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అంటే కేవలం లాగిన్ అయిన వారు మాత్రమే కామెంట్ పెట్టగలుగుతారు. నెగిటివ్ కామెంట్ ఇచ్చే వ్యక్తులను బ్లాక్ చేయొచ్చు. ఇన్ని ఫీచర్లు ఉన్నా కూడా ప్రైవసీ విషయంలో ఇంకా శ్రద్ధ పెట్టాల్సి ఉందన్నది యూజర్ల అభిప్రాయం.