Saranam Gacchami
-
ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణవాదులందరికీ తన సాహిత్యంతో ప్రేమ్‌రాజ్ ఎంతో స్ఫూర్తినిచ్చారు. అలాంటి వ్యక్తి మంచి ఆశయంతో తెరకెక్కించిన ‘శరణం గచ్చామి’ చిత్రానికి ఆయన అడగకున్నా ప్రభుత్వం నుంచి ట్యాక్స్, సబ్సిడీ అందేలా పర్సనల్ కేర్ తీసుకుంటా. ఈ సినిమా విజయం సాధించి, ఇలాంటి చిత్రాలు మరిన్ని రావడానికి ఊతమివ్వాలని ఆశిస్తున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, జయప్రకాష్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో మురళి బొమ్మకు నిర్మించిన చిత్రం ‘శరణం గచ్చామి’. రవి కల్యాణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కేటీఆర్ విడుదల చేశారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దళితులు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు ప్రేమ్‌రాజ్. ఈ చిత్రానికి సమర్పణ: బొమ్మకు హిమమాల మురళి. -
సెన్సార్ బోర్డ్ తీరు బాధాకరం
‘‘యువతరాన్ని మేల్కొలిపేలా.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ క్లీన్ ఎంటర్టైనర్గా ‘శరణం గచ్ఛామి‘ సినిమా తీశాం. అయితే, సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. వారి తీరు ఆవేదనను కలిగిస్తోంది’’ అన్నారు చిత్ర దర్శక– నిర్మాతలు ప్రేమ్‌రాజ్, బొమ్మకు మురళి. నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అశ్లీలం, హింసను ప్రేరేపిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న సినిమాలకు ‘క్లీన్ సర్టిఫికెట్స్’ జారీ చేసే సెన్సార్ బోర్డ్ సభ్యులు, క్లీన్‌గా తెరకెక్కిన మా చిత్రానికి ఎందుకు ఇవ్వడం లేదో తెలియడంలేదు. సరైన కారణాలు చూపకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లమనడం బాధాకరం. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణి, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళతాం’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు. -
'సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు'
దర్శకుడు ప్రేమ్ రాజ్ తెరకెక్కించిన శరణం గచ్ఛామి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డ్ నిరాకరించటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయటంపై తెరకెక్కించిన ఈ సినిమా రాజ్యంగంలోని పలు నింబధనలను ఉల్లంఘించిందన్న కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తన సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను, డైలాగ్‌లను తొలగించేందుకు తాను సిద్ధమని అలాంటివేవీ చెప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వకపోవటం అన్యాయం అంటున్నారు దర్శకుడు ప్రేమ్ రాజ్. ప్రాంతీయ సెన్సార్‌బోర్డ్ సెన్సార్‌కు నిరాకరించటంతో ప్రస్తుతం కేంద్ర సెన్సార్‌బోర్డ్‌ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఇటీవల సెన్సార్‌బోర్డ్ నిర్ణయాలు వివాదాస్పద మవుతున్న నేపథ్యంలో శరణం గచ్ఛామి విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డ్, ఏ నిర్ణయం తీసుకోనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.