సెన్సార్ బోర్డ్ తీరు బాధాకరం
‘‘యువతరాన్ని మేల్కొలిపేలా.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ‘శరణం గచ్ఛామి‘ సినిమా తీశాం. అయితే, సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. వారి తీరు ఆవేదనను కలిగిస్తోంది’’ అన్నారు చిత్ర దర్శక– నిర్మాతలు ప్రేమ్‌రాజ్, బొమ్మకు మురళి. నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’.
ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అశ్లీలం, హింసను ప్రేరేపిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న సినిమాలకు ‘క్లీన్ సర్టిఫికెట్స్’ జారీ చేసే సెన్సార్ బోర్డ్ సభ్యులు, క్లీన్‌గా తెరకెక్కిన మా చిత్రానికి ఎందుకు ఇవ్వడం లేదో తెలియడంలేదు. సరైన కారణాలు చూపకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లమనడం బాధాకరం. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణి, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళతాం’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు.