ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణవాదులందరికీ తన సాహిత్యంతో ప్రేమ్‌రాజ్ ఎంతో స్ఫూర్తినిచ్చారు. అలాంటి వ్యక్తి మంచి ఆశయంతో తెరకెక్కించిన ‘శరణం గచ్చామి’ చిత్రానికి ఆయన అడగకున్నా ప్రభుత్వం నుంచి ట్యాక్స్, సబ్సిడీ అందేలా పర్సనల్ కేర్ తీసుకుంటా. ఈ సినిమా విజయం సాధించి, ఇలాంటి చిత్రాలు మరిన్ని రావడానికి ఊతమివ్వాలని ఆశిస్తున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు.
నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, జయప్రకాష్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో మురళి బొమ్మకు నిర్మించిన చిత్రం ‘శరణం గచ్చామి’. రవి కల్యాణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కేటీఆర్ విడుదల చేశారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దళితులు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు ప్రేమ్‌రాజ్. ఈ చిత్రానికి సమర్పణ: బొమ్మకు హిమమాల మురళి.