1 నుంచి విజయదుర్గా పీఠంలో శరన్నవరాత్రులు
నిత్యం అమ్మవారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు
వెదురుపాక(రాయవరం) :
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో వచ్చే నెల ఒకటి నుంచి 11 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) శనివారం పీఠాధిపతి వి.వి.సుబ్రహ్మణ్యం(గాడ్) సమక్షంలో వివరాలను విలేకరులకు తెలిపారు. ఒకటిన ఆశ్వయుజ శుద్ధపాడ్యమి ఉదయం 9.18 గంటలకు హస్తా నక్షత్రం సూర్యహోరలో కలశస్థాపన జరుగుతుంది. విజయదుర్గా అమ్మవారికి రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఒకటిన రజత కవచధారిణి, 2న శ్రీబాలాత్రిపుర సుందరి, 3న అన్నపూర్ణాదేవి, 4, 5 తేదీల్లో గాయత్రీదేవి, 6న లలితా త్రిపురసుందరీదేవి, 7న సరస్వతీదేవి, 8న మహాలక్ష్మీదేవి, 9న దుర్గాదేవి, 10న మహిషాసుర మర్దిని, 11న విజయదశమి రోజు రాజరాజేశ్వరీదేవి అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. కాగా గాడ్ సమక్షంలో ఆహ్వానపత్రికను ఆవిష్కరించిన బాపిరాజు, బాబి పీఠానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పీఠం భక్తజన కమిటీ సభ్యుడు గాదె భాస్కరనారాయణ తదితరులు పాల్గొన్నారు.