రీ పోస్టుమార్టానికి హైకోర్టు నిరాకరణ!
శరణ్య తండ్రి పిటిషన్ కొట్టివేత
సాక్షి, చెన్నై : తన కుమార్తె మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించేం దుకు ఆదేశించాలని విద్యార్థిని శరణ్య తండ్రి ఏలుమైల చేసుకున్న విజ్ఞప్తిని మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. రీ పోస్టుమార్టంకు అనుమతి ఇవ్వబోమం టూ పిటిషన్ను న్యాయమూర్తి మాల తిరస్కరించారు. విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చిలోని ఎస్వీఎస్ సిద్ద వైద్య కళాశాలకు చెందిన విద్యా కుసుమాలు మోనీషా, శరణ్య, ప్రియాంకలు అనుమానాస్పద స్థితిలో బావిలో గత నెల శవాలుగా తేలిన విషయం తెలిసిందే. మోనీషా మృత దేహానికి మాత్రం రీ పోస్టుమార్టం సంఘట జరిగిన ఐదో రోజు చెన్నైలో జరిగింది.
అయితే, మిగిలిన ఇద్దరి మృతదేహాల పోస్టుమార్టం విల్లుపురంలో పూర్తి చేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం సీబీసీఐడీ చేతిలో ఉన్నది. దర్యాప్తును ప్రత్యేక బృందాలు వేగవంతం చేసి ఉన్నాయి. ఆ కళాశాల కరస్పాండెంట్ వాసుకి కారులో మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం, అందులో ఉన్న సమాచారాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. అలాగే, ఆమె ఇంట్లో సోదాకులకు సిద్ధం అయ్యారు. ఈ పరిస్థితుల్లో మోనీషా మృత దేహానికి జరిపిన పోస్టుమార్టం నివేదిక కోర్టుకు చేరడం, అందులో హత్యే అన్న అనుమానాలకు బలం చేకూర్చే అంశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.
దీంతో తన కుమార్తె శరణ్య మృత దేహానికి సైతం రీ పోస్టుమార్టంకు ఆదేశించాలంటూ కాంచీపురం జిల్లా సెయ్యారుకు చెందిన ఆమె తండ్రి ఏలుమలై కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్ విచారణ కొనసాగించేందుకు హైకోర్టు నిరాకరించింది. మంగళవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు వాదనలతో న్యాయమూర్తి మాల ఏకీభవించారు. మృత దేహంకు అంత్యక్రియలు జరిగిన పన్నెండు రోజులకు పైగా అవుతున్నదని, ఇప్పటికే విల్లుపురం వైద్యులు పోస్టుమార్టం జరిపిన దృష్ట్యా, మళ్లీ రీ పోస్టుమార్టంకు ఆదేశాలు ఇవ్వలేమంటూ పిటిషన్ను తోసి పుచ్చారు.
అయితే, రీ పోస్టుమార్టం నిమిత్తం అప్పీలుకు వెళ్తామంటూ ఏలుమలై తర ఫు న్యాయవాదులు పేర్కొన్నారు. కాగా, తన కుమార్తె మృత దేహానికి జరిగినట్టే శరణ్య మృతదేహానికి కూడా రీ పోస్టుమార్టం జరిపేందుకు ఆదేశించాలని మోనీషా తండ్రి తమిళరసన్ విన్నవించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది రీ పోస్టుమార్టంకు అడ్డు పడటం చూస్తుంటే, ఆ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు అనుమానం కల్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతికి నష పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష నగదును స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు.