రైతులపై బాబు లాఠీఛార్జి
ఏపీ సీఎం కార్యాలయం వద్ద పోలీసుల జులుం
సరస్వతీ సిమెంట్స్ లీజు పునరుద్ధరించాలని కోరిన రైతులు
వినతిపత్రం ఇవ్వటానికి గుంటూరు నుంచి సీఎం వద్దకు
ఒకరిద్దరిని అనుమతించాలని కోరినా ససేమిరా అన్న పోలీసులు
తరుముతూ లాఠీఛార్జి... ఆపై ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు
హైదరాబాద్: ఎంత దారుణం? ఆరుగాలం శ్రమించే రైతన్నకూ పార్టీలుంటాయా? రైతుల్ని కూడా రాజకీయాల కోసం రెచ్చగొట్టి వేరు చేస్తారా? సరస్వతి సిమెంట్స్ వ్యవహారంలో తామే ముందుండి కొందరు రైతుల్ని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపైకి రెచ్చగొట్టింది టీడీపీ నేతలే. కొందరు రైతుల్ని బస్సుల్లో తీసుకొచ్చింది స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు... తెలుగు విద్యార్థి నాయకుడు నాదెళ్ల బ్రహ్మం చౌదరి. పార్టీ కార్యకర్తలతో సహా కొందరు రైతుల్ని బస్సుల్లో హైదరాబాద్‌కు తెచ్చి, జగన్ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయించి... ఆయన ఇంటి వద్ద బైఠాయింపజేసిన ఈ నేతలు... తరవాత నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకే వారిని తీసుకెళ్లారు. చంద్రబాబు వారితో మాట్లాడటమేకాక వారి వినతిపత్రం తీసుకున్నారు. వారికి న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు.
ఇది జరిగి 24 గంటలు కూడా గడవలేదు. టీడీపీ నేతలు తీసుకొచ్చిన రైతులకన్నా దాదాపు నాలుగు రెట్ల మంది రైతులు స్వయంగా వారే హైదరాబాద్‌కు వచ్చారు. తమ భూములకు తగిన ధరనే పొందామని, అక్కడ సరస్వతీ పవర్ సంస్థ సిమెంటు ప్లాంటును ఏర్పాటు చేస్తే తమకందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి కనక దానికి తక్షణం అనుమతులివ్వాలని, రద్దు చేసిన లీజును వెంటనే పునరుద్ధరించాలని వారంతా కోరారు. ఒకవైపు ప్రభుత్వం అనుమతులివ్వకుండా... ప్లాంటు పెట్టలేదనే కారణంతో లీజు రద్దు చేయటం సరికాదంటూ వారు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలవటానికి వెళ్లారు. ఏ ముఖ్యమంత్రయినా ఏం చేయాలి? రైతులు తమ దగ్గరకు వచ్చినపుడు వారు చెప్పేది వినాలి? వారి సమస్యలపై స్పందించాలి.
శనివారంనాడు తమ పార్టీ నేతలు ముందుండి కొందరు రైతుల్ని తీసుకొచ్చినపుడు చంద్రబాబునాయుడు చేసిందదే. మరి ఆదివారం రైతులు వారంతట వారే వచ్చినపుడు కూడా అదే చేయాల్సి ఉండగా... వారు జగన్మోహన్రెడ్డి కంపెనీని సమర్థిస్తున్నారని, ప్రభుత్వం అనుమతులివ్వకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో ఏం చేశారో తెలుసా? ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ వద్దకు చెన్నాయపాళెం, తంగేడు, వేమూరు గ్రామాల నుంచి వచ్చిన రైతుల పట్ల దారుణంగా వ్యవహరించారు. సరస్వతీ సిమెంట్స్‌కు అనుమతులు ఇవ్వాలని, గనుల లీజు రద్దును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తూ శాంతియుతంగా వినతిపత్రం సమర్పించడానికి వస్తూ ఉండగా పోలీసులు వారిని అనుమతించలేదు.
ఒకరిద్దరిని క్యాంపు కార్యాలయంలోకి అనుమతిస్తే తాము సీఎంకు వినతిపత్రం సమర్పించి వాస్తవాలు వివరించి వెళ్లి పోతామని విజ్ఞప్తి చేసినా పోలీసులు ససేమిరా అన్నారు. సరికదా... కార్యాలయానికి చాలా దూరంలో ఉండగానే, ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా లాఠీలతో వారిని వెనక్కి తరమటానికి ప్రయత్నించారు. దొరికిన వారిని దొరికినట్లుగా కొడుతూ ఈడ్చుకెళ్లారు. కొందరిని అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. దీనిపై రైతులు కోటిరెడ్డి, రామిరెడ్డి మాట్లాడుతూ... ‘‘మేం సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పొలాలను అమ్మేశాం. మాకు సంబంధం లేని వేరే వ్యక్తులు ఆ భూముల్ని సాగు చేయబోగా ఫ్యాక్టరీ వారు అడ్డుకున్నారు. దీన్ని రాజకీయం చేస్తూ ఫ్యాక్టరీ మైనింగ్ లీజులను రద్దు చేశారు. ఫ్యాక్టరీ త్వరగా ప్రారంభమైతే ఉపాధి దొరుకుతుందని మేం ఎదురు చూస్తున్నాం. దీనిపై రాజకీయాలు తగవు’’ అని చెప్పారు.
ఇదే విషయమై సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించామని, పోలీసులు అన్యాయంగా తమను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ లీజును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు పెట్టేవారికి సింగిల్ విండోలో అనుమతులిచ్చేస్తామని, పెట్టుబడులతో రావాలని ఉపన్యాసాలిస్తూ మరోవంక అనుమతులివ్వకుండా మోకాలడ్డటం బాబు ద్వంద్వ నీతిని బయటపెట్టేదయితే... తన పార్టీ వారే పరిశ్రమలు పెట్టాలి తప్ప ఇతరులు పెట్టకూడదన్నది ఆయన కుటిలనీతిని బయటపెడుతోంది. చూశారా.. బాబు ప్రభుత్వ తీరు!
ఒక సామాజికవర్గం వారిదే రాద్ధాంతం
వినతిపత్రంలో పేర్కొన్న రైతులు
గుంటూరు జిల్లా మాచవరం మండల, గ్రామాల రైతులు ముఖ్యమంత్రికివ్వాలని రూపొందించిన వినతిపత్రంలో వివరాలిలా ఉన్నాయి. ‘ అయ్యా... మా మండలంలోని గ్రామాలు ఏ నాటి నుంచో అభివృద్ధికి నోచుకోలేదని తమరికి తెలుసు. మా ప్రాంతంలో పరిశ్రమలు వస్తే త్ప మా పిల్లలకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. ఈ రోజున తమరి పార్టీ (టీడీపీ) వారు, తమరి ప్రభుత్వం మా ప్రాంతంలోని కొందరిని రెచ్చగొట్టి హైదరాబాద్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి మీదికి పంపటాన్ని నిన్న టీవీల్లో చూశాం. అలా వచ్చిన వారంతా ఒక సామాజికవర్గం వారే. మీ పార్టీ నాయకులే. ఆ విషయం మీకూ తెలుసు.
ఇలా గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టటం వల్ల గ్రామీణ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. సాక్షాత్తూ మీ పార్టీ ఎమ్మెల్యేనే ఇదంతా నడిపిస్తున్నారంటే అందుకు మీ ఆశీర్వాదం కూడా ఉన్నదని ప్రజలుగా మేం భావిస్తున్నాం. సరస్వతీ పవర్ వారి భూములను మా గ్రామాల్లో ప్రజలు నష్టాలకు అమ్ముకున్నారని మీ పార్టీ వారు అంటున్నారు. మా గ్రామాల్లోనే మిగతా సిమెంట్ కంపెనీలు ఎకరం లక్షన్నరకు కొన్న రోజుల్లో సరస్వతీ వారు రూ.3 లక్షలు చెల్లించారు. ఈ విషయం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి రికార్డులు చూసినా అర్థం అవుతుంది.
అలాగే, ఆ తరువాత సరస్వతీ సిమెంట్ వారు మా భూములను రు. 8.5 లక్షల వరకూ చెల్లించి కొనుగోలు చేశారు. మిగతా ఏ సిమెంట్ కంపెనీ కూడా ఇంత ధర చెల్లించలేదని తెలియ జేసుకుంటూ హైదరాబాద్‌కు వచ్చి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సరస్వతీ పవర్‌కు రద్దు చేసిన లీజులను తక్షణం పునరుద్ధరించి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గల నీటి కేటాయింపులు, మరియు పొల్యూషన్ బోర్డు అనుమతులు తక్షణమే మంజూరు చేయించి మా ప్రాంతం అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. ఈ వినతిపత్రంపై పి.జాన్ సైమన్, ఎస్.బాలు నాయక్, బి.వెంకటేష్, షేక్ నన్నా, వి.బాలకృష్ణ, మండ్ల శ్రీనివాసరావు, బి.శ్రీరామ్‌నాయక్, షేక్ బడేసా, బి.నాగుల్‌మీరా, ఎస్.ఏ.రఫీ, కె.మోహన్‌తో సహా పలువురు రైతులు సంతకాలు చేశారు.