Saree Shop
-
భలే దొంగలు.. సీసీ ఫుటేజీ వైరల్.. ‘తొలిసారి దొంగతనం చేశాం క్షమించండి’
సాక్షి, హైదరాబాద్: వస్త్ర దుకాణంలోకి కొనుగోలుదారుల్లా వచ్చిన దొంగలు.. దృష్టి మరల్చి ఖరీదైన చీరలను నొక్కేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెక్కేశారు. నానా హంగామా చేసి ఒక్క చీర కూడా కొనకుండా తిరిగి వెళ్లిపోవటంతో అనుమానం వచ్చిన షాపు యజమానురాలు.. సీసీ టీవీ కెమెరాలోని ఫుటేజీని పరిశీలించారు. వచ్చింది కస్టమర్లు కాదు దొంగలు అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కెమెరాలో నమోదైన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్‌గా మారి దొంగల వరకూ చేరింది. దీంతో ఇంట్లో పిల్లలకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు.. షాపు యజమానురాలికి ఫోన్ చేసి తప్పయిందని ఒప్పుకొన్నారు. తాము దొంగిలించిన చీరలను తిరిగి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొనుగోలుదారుల్లా వచ్చి.. ► మణికొండలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులో పావులూరి నాగతేజకు తేజ సారీస్ పేరుతో బోటిక్ ఉంది. గత సోమవారం గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు (ఓ పురుషుడు, అయిదుగురు మహిళలు) నంబరు ప్లేట్‌లేని స్కార్పియో కారులో వచ్చారు. షాపు ముందు వాహనంలో నుంచి దిగి రెండు బృందాలుగా విడిపోయి కొనుగోలుదారుల్లా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించారు. బోటిక్లోని విక్రయదారులను చీరలు చూపించండి అని వారి దృష్టి మళ్లించారు. రూ.2 లక్షలు విలువైన అయిదు ఖరీదైన చీరలను దొంగిలించారు. ►ఏమీ కొనకుండానే 15 నిమిషాల్లో అక్కడి నుంచి నిష్క్రమించారు. ► వీరి కదలికలపై నాగతేజకు అనుమానం వచ్చి వెంటనే స్టాక్‌ను చెక్ చేసి చీరలు తగ్గినట్లు గుర్తించారు. షాపులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలించారు. కొనుగోలుదారుల్లా వచ్చిన అయిదుగురు సభ్యులు ఒకే ముఠా అని, చీరలు దొంగతనం చేసి స్కార్పియో కారులో పరారైనట్లు అందులో రికార్డయింది. ఆ వీడియోలను నాగతేజ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టు చేశారు. ►ఆ దృశ్యాలను చూసిన కోకాపేటకు చెందిన మరో షాపు యజమాని నాగతేజకు ఫోన్ చేశారు. తన షాపులోనూ ఇదే ముఠా సభ్యులు ఇదే తరహాలో రూ.10 లక్షలు విలువైన చీరలు ఎత్తుకెళ్లారని వివరించారు. ఓ నేత కార్మికుడు, షాపు యజమానికి ఫోన్ చేసి.. మార్చి 9న తన షాపులోనూ చోరీ జరిగిందని తెలిపారు. ఇదే తరహాలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 షాపుల యజమానులు చోరీ జరిగిందంటూ నాగతేజకు వివరించారు. మొదటిసారి దొంగతనం చేశామని.. వైరల్‌గా మారిన సదరు వీడియోలు.. సదరు ముఠా సభ్యుల కంట పడటంతో షాక్ తిన్నారు. వెంటనే గ్యాంగ్‌లోని ఓ మహిళ షాపు యజమానురాలు నాగతేజకు ఫోన్ చేసి.. తొలిసారిగా దొంగతనం చేశామని, తప్పయిందని ప్రాధేయపడింది. దొంగిలించిన చీరలను తిరిగిచ్చేస్తామని చెప్పింది. ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలోని వీడియో, ఫొటోలను తమ పిల్లలు చూస్తే పరువుపోతుందని వాటిని డిలీట్ చేయాలని అభ్యర్థించింది. పోస్టులను తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. వెంటనే దుకాణానికి వచ్చి చీరలు రిటర్న్ చేయాలని నాగతేజ సూచించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరోసారి మహిళ నాగతేజకు ఫోన్ చేసింది. బొటిక్కు కొద్ది దూరంలో ఉన్న మరో షాపు సెక్యూరిటీ గార్డు వద్ద చోరీ చేసిన చీరలు అప్పగించామని వివరించింది. వెంటనే అక్కడికి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకున్న నాగతేజ.. పరిసర ప్రాంతాలలో గాలించగా నిందితులు అప్పటికే అక్కణ్నుంచి పరారయ్యారు. సోషల్ మీడియాను ఫాలో అవుతూ.. షాపింగ్ మాల్స్‌లో దుస్తులకు ట్యాగ్స్ ఉంటాయి. వాటిని చోరీ చేస్తే మాల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు స్కానర్ వద్ద దొరికిపోతామని గుర్తించిన ఈ ముఠా.. ట్యాగ్స్ లేకుండా ఉండే సాధారణ షాపుల్లో మాత్రమే చోరీలకు పాల్పడుతోంది. కొత్త స్టాక్ రాగానే కస్టమర్లను ఆకర్షించేందుకు దుకాణాదారులు సోషల్ మీడియాలో పోస్టులతో ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండే ఈ ముఠా.. నిరంతరం పోస్టులను ఫాలో అవుతూ ఖరీదైన చీరలు ఉండే షాపులను టార్గెట్ చేసుకొని చోరీలు చేస్తుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
నేను కూడా చేనేత కుటుంబ కోడలినే: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ఆప్కో సమ్మర్ సారీ మేళాను ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలలా ఆప్కో షోరూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మర్ శారీ మేళా ద్వారా మహిళలకు 30శాతం డిస్కౌంట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. చీరలు, చుడీదార్లు, పెళ్లి బట్టలు చాలా రకాల వెరైటీల్లో దొరుకుతున్నాయన్నారు. మహిళల మనసు దోచే విధంగా ఆప్కోలో చీరలు ఉన్నాయన్నారు. బయట షోరూమ్‌లకు ధీటుగా ఆప్కో షోరూమ్‌లు ఉన్నాయన్నారు. తాను కూడా చేనేత కుటుంబ కోడలినని మంత్రి రోజా తెలిపారు. నేతన్నలకు ఆర్ధిక చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు అందిస్తున్నారని అన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు సహకరిద్దామని ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. -
ఖరీదైన చీరలపై మోజు
బంజారాహిల్స్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని చీరల షోరూంలలో సరికొత్త డిజైన్ల చీరలు కట్టుకోవాలని ఆమెకు ఆశ. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో కనువిందు చేసే వాటిని కట్టుకోవడం కష్టతరంగా మారింది. తన ఇష్టాన్ని ఎలాగైనా తీర్చుకోవాలన్న కోరిక ఓ యువతిని దొంగగా మార్చింది. తల్లితో కలిసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని ఖరీదైన షోరూంలకు వెళ్తూ సేల్స్‌మెన్స్ కళ్లుగప్పి తాము ఇష్టపడ్డ చీరలను దొంగిలిస్తున్న తల్లీ, కూతుళ్లను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... అంబర్‌పేట సలీంనగర్ కాలనీకి చెందిన నల్లూరి సుజాత, ఆమె కుమార్తె నల్లూరి వెంకటలక్ష్మి పావనికి చీరలంటే మోజు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని తలాశా క్లాత్ షోరూంకు వచ్చింది. అందులో తాను ఇష్టపడ్డ రూ. 1.10 లక్షల విలువ చేసే అయిదు చీరలను, అదే రోజు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని గోల్డెన్ థ్రెడ్స్ క్లాత్ స్టోర్‌లో రూ. 2.80 లక్షల విలువ చేసే నాలుగు చీరలను దొంగిలించి పరారయ్యారు. షాపు యజమానురాలు కవిత ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం సీఐ రమేష్, డీఎస్ఐ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేసిన తర్వాత తల్లీకూతుళ్లు ఇద్దరు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో రైలెక్కి ముసరంబాగ్ స్టేషన్లో దిగారు. ఆయా ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు స్పష్టంగా ఉండటంతో వీరు స్వైప్ చేసిన మెట్రో కార్డ్ ఆధారంగా వారి అడ్రస్ గుర్తించారు. సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 3.90 లక్షల విలువైన తొమ్మిది చీరలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు) -
చీరలు దొంగిలించారు. ఆ తరువాత!
సాక్షి, మంగళగిరి(గుంటూరు) : అనుకొన్న ప్రణాళిక ప్రకారం పక్కాగా దొంగతనం చేశారు. కాని పట్టుబడతామేమోనని దొంగిలించిన వాటిని వదిలివెళ్లారు. ఈ ఘటన మంగళగిరి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మంగళగిరి పట్టణ పరిధిలోని పాత మంగళగిరిలోని దింపుడుకళ్లం సెంటర్ వద్ద ఉన్న శ్యామలాదేవి హ్యాండ్లూమ్స్కు మంగళవారం మధ్యాహ్నం చీరల కొనుగోలుకు ఐదుగురు మహిళలు వచ్చారు. చీరలు చూపించమని అక్కడ ఉన్న యజమానిని, గుమాస్తాలను అడిగారు. ఒకరి తర్వాత ఒకరు హడావుడి చేస్తూ చీరలను చూసే సమయంలో వచ్చిన మహిళలు కొన్ని చీరలను దొంగతనం చేశారు. అయితే ఏమీ నచ్చలేదంటూ తిరిగి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన కొద్ది సమయానికి ఓ యువకుడు షాపులోకి వచ్చి కాటన్ షర్టు బిట్లు చూపించమని అడగ్గా, ఆ కొట్టు యజమాని కొద్ది సేపు ఉండమని, సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు ఆ యువకుడికి తెలిపాడు. ఇంతలో ఆ యువకుడు ఏమైందంటూ ఆత్రంగా అడగ్గా, మీరేం చేస్తారంటూ ఆ యువకుడ్ని ప్రశ్నించాడు. ఆ యువకుడు డీజీపీ ఆఫీసులో పనిచేస్తానంటూ సమాధానం చెప్పాడు. అయితే మీతో పనిపడేలా ఉందంటూ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ, ఇప్పుడే వచ్చి వెళ్లిన ఐదుగురు మహిళలు చీరలు దొంగతనం చేసి ఉండవచ్చని క్షుణ్ణంగా చూశాడు. ఆ ఫుటేజ్‌లో మహిళలు చీరలను దొంగిలిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో, ఆ యువకుడికి విషయం తెలియజేశాడు. ఇంతలో యువకుడు ఇప్పుడే వస్తానంటూ బయటకు జారుకుని కొద్దిసేపటి తర్వాత షాపుకి ఫోన్ చేసి, మీ చీరలను తీసుకువెళ్లింది మా వారేనని, పొరపాటున తీసుకువెళ్లారు, ఎవరికీ చెప్పవద్దంటూ తెలియజేశాడు. మీ చీరలను మీ షాపు ఎదురుగా ఉన్న కూల్డ్రింక్స్షాపు పక్కనే పెట్టామని, అవి తీసుకొని మర్చిపోండంటూ ఫోన్లో యజమానికి తెలియజేసి, ఫోన్ కట్ చేశాడు. హడావుడిగా షాపు యజమాని ఎదురుగా ఉన్న షాపు దగ్గరకు వెళ్లి చూడగా, ఓ సంచిలో చీరలు పెట్టి ఉన్నట్లు గమనించి, ఆ సంచిని షాపునకు తీసుకువెళ్లాడు. ఒక్కొక్క చీర విలువ సుమారు రూ.6వేలు పైనే ఉంటుందని, మొత్తం 7 చీరలను వారు వదిలివెళ్లినట్లు, వాటి విలువ సుమారుగా రూ.40వేలకు పైగా ఉంటుందని షాపు యజమాని తెలియజేశాడు. అయితే ఈ ఏడు చీరలే తీసుకువెళ్లారా, ఇంకేమైనా దొంగిలించి ఉంటారా అనేది స్పష్టంగా తెలియదంటూ యజమాని పేర్కొన్నాడు. ఇంత జరిగినా షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
రూ.20లకే చీర.. పోటెత్తిన మహిళలు
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లిలో ఓ వస్త్ర దుకాణంలో రూ.20లకే చీర అని ఆఫర్ పెట్టడంతో మహిళలు బారులు తీరారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఓ దుకాణదారుడు రూ.20కే చీరంటూ చేసిన ప్రకటనతో చుట్టుపక్క గ్రామాల మహిళలంతా షాపు వద్దకి పోటెత్తారు. ఉదయం నుంచే దుకాణం ముందు అర కిలోమీటరు మేర బారులు తీరారు. దుకాణం తెరవగానే చీరలను దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు తోసుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వారిని అదుపు చేయడంలో విఫలమైన నిర్వాహకులు చివరకు దుకాణాన్ని తాత్కాలికంగా మూసేశారు. -
వస్త్రదుకాణంలో యువతిపై యజమాని అత్యాచారయత్నం
హైదరాబాద్: పాతబస్తీలోని ఒక వస్త్ర దుకాణంలో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఆ దుకాణ యజమానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. శారీ షాప్ యజమాని అంజద్ తనపై అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.