కాలకూటం!
గ్రామంలో రెండు కల్లు దుకాణాల మధ్య ఉన్న పోటీ పేదల ప్రాణాల మీదికి వచ్చింది. కిక్కు ఎక్కువ ఇవ్వాలని ఒకరి కంటే ఒకరు పోటీగా కల్తీ కల్లు తయారు చేసి విక్రయించడంతో, అది తాగిన 30మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గోపాల్పేట మండలం బండరావిపాకులలో చోటు చేసుకుంది.
- గోపాల్పేట
గ్రామంలోని రెండు కల్లు దుకాణాల్లో గురువారం సాయంత్రం డైజోఫామ్, సీహెచ్ ఎక్కువ మొత్తంలో కలిపి కల్లును విక్రయించారు. దీన్ని తాగిని కల్లు ప్రియులు కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నారు. శుక్రవారం ఉదయం వరకు కూడా వారు స్పృహలోకి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామసర్పంచ్ రమాదేవి, ఆమె భర్త సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించి వెంటనే 108కు సమాచారం ఇచ్చి, బాధితులను నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్సై షాకీర్‌అహ్మద్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని రెండు కల్లు దుకాణాల్లో షాంపిళ్లను సేకరించి, దుకాణాలను సీజ్ చేశారు. అస్వస్థతకు గురైన 26మంది నాగర్‌కర్నూల్‌లో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బాధితులు వీరే..
బాల్‌రెడ్డి, బాలకిష్టమ్మ, నర్సింహ్మరెడ్డి, భాగ్యమ్మ, సుందరమ్మ, వెంకటమ్మ, లాలమ్మ, బాలమ్మ, తలారి లక్ష్మీదేవమ్మ, తెల్గు లక్ష్మీ, తలారి చెన్నమ్మ, నాగమ్మ, లింగమ్మ, రాములు, కిష్టమ్మ, మశమ్మ, నాగయ్య, సాంబశివుడు, సువర్ణ, లచ్చమ్మ, లింగమ్మ, నర్సింహ్మ, కొంకలపల్లి గ్రామానికి చెందిన మరికొందరు కల్తీ కల్లు తాగి అస్వస్తతకు గురయ్యారు. ఇందులో బాల్‌రెడ్డి, వెంకటమ్మ, లాలమ్మ, బాలమ్మల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. నాగర్‌కర్నూల్ ఈఎస్ జి.శ్రీనివాస్‌రెడ్డి, ఏఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ యుమునాధర్రావు ఆస్పత్రికి వెళ్లి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
మత్తు పదార్థాలు ఉన్నట్లు తేలితే కేసులు
ఈ సంఘటనకు సంబంధించి ఎక్సైజ్ ఎస్ఐ షాకీర్అహ్మద్ను ‘సాక్షి’ వివరణ కోరగా రెండు కల్లు దుకాణాల్లో ఏ దుకాణంలో వీరి కల్లు తాగింది తెలియదని, రెండు దుకాణాల నుంచి షాంపిళ్లను సేకరించి ఎఫ్ఎస్ఎల్ కోసం హైదరాబాదుకు పంపినట్లు తెలిపారు. ఈ రిపోర్టులో డైజోఫామ్, అల్ఫాజోలం కలిపినట్లు వస్తే దుకాణాల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని, లెస్సైన్స్లు కూడా రద్దు చేస్తామని చెప్పారు.