Sasana Sabha Movie
-
ఈ విజయం వారిదే: రాజేంద్రప్రసాద్
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి మా ‘శాసనసభ’తో నిరూపించారు. ఈ విజయం వారిదే’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసన సభ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శాసనసభ’లో నేను చేసిన నారాయణ స్వామి పాత్రకి మంచి పేరొచ్చిందంటే దానికి కారణం రచయిత రాఘవేందర్ రెడ్డి, దర్శకుడు వేణు.. నాది మూడో స్థానం. సినిమా విడుదలైన మూడో రోజే 60 థియేటర్స్ పెరగడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రవిజయం పట్ల యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. -
అప్పుడు మేం సక్సెస్ అయినట్లే: రాఘవేంద్ర రెడ్డి
ఇంద్రసేన హీరోగా వేణు మడికంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్ బకుని హీరోయిన్. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో రైటర్ అవ్వాలనుకున్నాను. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు అంత సులభం కాదని తెలిసింది. దీంతో సినిమా జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, టీవీ చానెల్స్‌కు శాటిలైట్ కన్సల్టెంట్‌గా చేశాను. ఇలా ఇండస్ట్రీలో నాకంటూ కొంత గుర్తింపు లభించడంతో రచయితగా కెరీర్ ఆరంభించాలనుకున్నాను. నా ఫ్రెండ్ ఇంద్రసేన కోసమే ఈ సినిమా కథ రాశాను. రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసినప్పటికీ ఇది ఏ రాజకీయ పార్టీ గురించిన సినిమా కాదు. ‘శాసనసభ’ అంటే పవిత్రమైన దేవాలయంతో సమానం. అటువంటి శాసనసభ గొప్పతనాన్ని ఈ తరంవారికి ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాను. యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓటర్లు పవిత్రమైన ఓటును అమ్ముకోకూడదు. ఈ సినిమా వల్ల కనీసం కొంతమంది ఆలోచించినా, ఇద్దరు, ముగ్గురు మారినా మేం సక్సెస్ అయినట్లుగా భావిస్తాను. దర్శకుడు వేణు ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ఇక నేను ఏ జానర్లో అయినా కథలు రాయగలను. అయితే కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకుంటాను. ప్రస్తుతం ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఓ క్రైమ్ సబ్జెక్ట్‌కు కథలు అందించాను’’ అని అన్నారు. -
‘శాసనసభ’ మూవీ రివ్యూ
టైటిల్ : శాసనసభ నటీనటులు: ఇంద్రసేన, డా.రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య రాజ్ బకుని, సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్, వేణు మండికంటి తదితరులు నిర్మాతలు: తులసీరామ్సాప్పని, షణ్ముగం సాప్పని కథ, స్రీన్‌ప్లే, డైలాగ్స్: రాఘవేంద్రరెడ్డి దర్శకత్వం: వేణు మడికంటి సంగీతం: రవి బసూర్ విడుదలతేది: డిసెంబర్ 16, 2022 అసలు కథేంటంటే: ఓ ఫిక్షనల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా.. ఏ పార్టీకి మెజారిటీ రాదు. ఎలాగైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న అనీష్ కురువిల్లా ప్రయత్నించగా.. ఈ సారి తానే సీఎం అవ్వాలని ప్రతిపక్ష పార్టీ నాయకురాలు సోనియా అగర్వాల్ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో స్వతంత్ర ఎమ్మెల్యేలకు డిమాండ్ ఏర్పడుతుంది. వారిని కొనడం కోసం రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటాయి. అందులో భాగంగా బేరసారాల్లో ఆరితేరిన దుర్గా(అమిత్ తివారి)ని జైలులో చంపాలని ఒకరు.. కాపాడాలని మరొకరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో దుర్గాని సూర్య(ఇంద్రసేన) కాపాడుతాడు. అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్య ఎవరు? స్వతంత్ర ఎమ్మెల్యేలను సూర్య ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న నారాయణ స్వామి( రాజేంద్రప్రసాద్)తో సూర్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. శాసనసభ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. జర్నలిస్ట్‌గా, శాటిలైట్ కన్సల్టెంట్‌గా ఎంతో అనుభవం ఉన్న రాఘవేంద్రరెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ కథను రాసుకున్నాడు. రాఘవేంద్రరెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దానిని అనుకున్న విధంగా తెరపై చూపించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. ఇక కీలకమైన సెకండాఫ్ నిరాశపరుస్తుంది. కథనం అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కొన్ని అంశాలు ఎలా నష్టాలు చేకూరుస్తున్నాయి వాటి వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. రాఘవేంద్రరెడ్డి రాసిన డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ‘ఓటేసే రోజునే వాడు రాజు..ఆ తర్వాత ఐదేళ్లు నేనే రాజు..నేనే మంత్రి’, డబ్బులు తీసుకొని ఓటు అమ్ముకున్న ఓటర్ని ప్రశ్నించే అధికారం ఎక్కడుంది’ ప్రతి వాడు యుద్దంలో గెలవాలనే చూస్తాడు. కానీ ఎవరో ఒకడు మాత్రమే గెలుస్తాడు..వాడినే వీరుడు అంటారు’లాంటి డైలాగ్స్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్‌ని కూడా కాస్త ఆసక్తికరంగా, ల్యాగ్ లేకుండా తీర్చిదిద్ది ఉంటే.. శాసన సభ ఓ మంచి పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలిచేది. ఎవరెలా చేశారంటే: ఇక నటీనటులు విషయానికొస్తే.. సూర్య పాత్రలో ఇంద్రసేన మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కానీ ఇతర కీలక సన్నివేశాల్లో బాగా నటించాడు. రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నారాయణ స్వామి పాత్రకి ఆయన జీవం పోశాడు. ముఖ్యమంత్రిగా అనీష్ కురువిల్లా, ప్రతిపక్ష నాయకురాలుగా సోనియా అగర్వాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. రవి బసూర్ సంగీతం, రాఘవేంద్రరెడ్డి స్క్రీన్‌ప్లే,మాటలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాన విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..
‘నన్ను పట్టుకుంటే జారిపోతుంటాను... ఒంపుసొంపులున్న పాదరసమే నేను.. నన్ను ముట్టుకుంటే నిప్పునవుతుంటాను.. సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..’ అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశారు హెబ్బా పటేల్. ఇంద్రసేన హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. తులసీరామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాతలు. రవి బసూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను పట్టుకుంటే..’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హెబ్బాపటేల్ మంచి స్టెప్పులు వేశారు. కాసర్లశ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, సంతోష్ వెంకీ, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసూర్ పాడారు. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. -
‘శాసన సభ’ కు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం
‘కేజీఎఫ్’ ఫేమ్ సంగీతదర్శకుడు రవి బస్రూర్ వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. తాజాగా ‘శాసన సభ’ చిత్రానికి సంగీతదర్శకుడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్ జంటగా రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ఇది. వేణు మడికంటి దర్శకత్వంలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా షణ్ముగం సాప్పని మాట్లాడుతూ–‘‘పొలిటికల్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రమిది. యూనివర్శల్ కథాంశంతో నిర్మించిన ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మెయిన్ పిల్లర్‌గా ఉంటాయి. ‘కేజీఎఫ్–2’ తర్వాత తెలుగులో ఆయన్నుంచి వస్తున్న చిత్రమిది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.