టైటిల్ : శాసనసభ
నటీనటులు: ఇంద్రసేన, డా.రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య రాజ్ బకుని, సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్, వేణు మండికంటి తదితరులు
నిర్మాతలు: తులసీరామ్‌సాప్పని, షణ్ముగం సాప్పని
కథ, స్రీన్‌ప్లే, డైలాగ్స్: రాఘవేంద్రరెడ్డి
దర్శకత్వం: వేణు మడికంటి
సంగీతం: రవి బసూర్
విడుదలతేది: డిసెంబర్ 16, 2022
అసలు కథేంటంటే:
ఓ ఫిక్షనల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా.. ఏ పార్టీకి మెజారిటీ రాదు. ఎలాగైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న అనీష్ కురువిల్లా ప్రయత్నించగా.. ఈ సారి తానే సీఎం అవ్వాలని ప్రతిపక్ష పార్టీ నాయకురాలు సోనియా అగర్వాల్ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో స్వతంత్ర ఎమ్మెల్యేలకు డిమాండ్ ఏర్పడుతుంది. వారిని కొనడం కోసం రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటాయి. అందులో భాగంగా బేరసారాల్లో ఆరితేరిన దుర్గా(అమిత్ తివారి)ని జైలులో చంపాలని ఒకరు.. కాపాడాలని మరొకరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో దుర్గాని సూర్య(ఇంద్రసేన) కాపాడుతాడు. అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్య ఎవరు? స్వతంత్ర ఎమ్మెల్యేలను సూర్య ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న నారాయణ స్వామి( రాజేంద్రప్రసాద్)తో సూర్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
శాసనసభ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. జర్నలిస్ట్‌గా, శాటిలైట్ కన్సల్టెంట్‌గా ఎంతో అనుభవం ఉన్న రాఘవేంద్రరెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథను రాసుకున్నాడు. రాఘవేంద్రరెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దానిని అనుకున్న విధంగా తెరపై చూపించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. ఇక కీలకమైన సెకండాఫ్ నిరాశపరుస్తుంది. కథనం అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కొన్ని అంశాలు ఎలా నష్టాలు చేకూరుస్తున్నాయి వాటి వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. రాఘవేంద్రరెడ్డి రాసిన డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.
‘ఓటేసే రోజునే వాడు రాజు..ఆ తర్వాత ఐదేళ్లు నేనే రాజు..నేనే మంత్రి’, డబ్బులు తీసుకొని ఓటు అమ్ముకున్న ఓటర్‌ని ప్రశ్నించే అధికారం ఎక్కడుంది’ ప్రతి వాడు యుద్దంలో గెలవాలనే చూస్తాడు. కానీ ఎవరో ఒకడు మాత్రమే గెలుస్తాడు..వాడినే వీరుడు అంటారు’లాంటి డైలాగ్స్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్‌ని కూడా కాస్త ఆసక్తికరంగా, ల్యాగ్ లేకుండా తీర్చిదిద్ది ఉంటే.. శాసన సభ ఓ మంచి పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలిచేది.
ఎవరెలా చేశారంటే:
ఇక నటీనటులు విషయానికొస్తే.. సూర్య పాత్రలో ఇంద్రసేన మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కానీ ఇతర కీలక సన్నివేశాల్లో బాగా నటించాడు. రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నారాయణ స్వామి పాత్రకి ఆయన జీవం పోశాడు. ముఖ్యమంత్రిగా అనీష్ కురువిల్లా, ప్రతిపక్ష నాయకురాలుగా సోనియా అగర్వాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. రవి బసూర్ సంగీతం, రాఘవేంద్రరెడ్డి స్క్రీన్‌ప్లే,మాటలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాన విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment