టైటిల్: కళ్యాణం కమనీయం
నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు
నిర్మాణసంస్థ: యూవీ కాన్సెప్ట్స్
దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని
ఎడిటర్: సత్య జి
విడుదల తేది: జనవరి 14, 2023
పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’.సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 14) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
శివ(సంతోష్ శోభన్) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం లేకుండా ఖాలీగా తిరుగుతుంటాడు. జాబ్ కోసం వెతుకున్న సమయంలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రుతి(ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత కూడా శివ ఉద్యోగం చేయడు. శ్రుతి ఒక్కతే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఒక రోజు సడన్‌గా శివను ఉద్యోగం చేయమని అడుగుతుంది శ్రుతి. దీంతో కథ మలుపు తిరుగుతుంది. శివ ఉద్యోగం సంపాదించే క్రమంలో ఓ అబద్దం చెబుతాడు. ఆ అబద్దం వారికి ఎన్ని కష్టాలను తెచ్చిపెట్టింది? శ్రుతికి ఆఫీస్‌లో ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఇతరుల కారణంగా వారి వైవాహిక జీవితంలోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? శివ, శ్రుతిలు ఎందుకు దూరమయ్యారు? చివరకు వారిద్దరు మళ్లీ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ.
కొత్తగా పెళ్లైయిన ఓ జంట చుట్టూ తిరిగే కథే ‘కల్యాణం కమనీయం’. వారిద్దరి వైవాహిక జీవితంలో ఎదురయ్యే సంఘటన నేపథ్యంలో కథనం సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయని, వాటిని భార్యాభర్తలు అనుభవాలుగా స్వీకరించి, కలిసి ముందుకు సాగితేనే ఆ బంధం నిలబడుతుందని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. భార్య భర్తల మధ్య వచ్చే సంఘర్షణలను మాత్రం ఆసక్తిగా రాసుకోలేకపోయాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఉద్యోగం చేసే భార్య, ఖాలీగా ఉండే భర్తల నేపథ్యంలో మరింత కామెడీ, ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అంతగా వాడుకోలేదు. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా, సాగదీత లేకుండా చూసుకున్నాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ ఇప్పటి జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. సెకండాఫ్‌లో కామెడీ కంటే ఎమోషనల్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమా నిడివి (109 నిమిషాలు) చాలా తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. కథనం ఆసక్తికరంగా సాగకపోయినా..ఎక్కడా బోర్ కొట్టదు. ప్రస్తుతం తరుణంగా ఈ సినిమా థియేటర్స్ ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పింస్తుందో తెలియదు కానీ.. ఓటీటీ ప్రేక్షకులను మాత్ర కచ్చితంగా అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
శివ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా నటించాడు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ, భార్య సంపాదన మీద బతికే కుర్రాడి పాత్రలో మెప్పించాడు. ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని రకాలుగా సంతోష్ శోభన్ ఆకట్టుకున్నాడు. ఇక ప్రియా భవానీ శంకర్ సైతం చక్కగా నటించింది. తెరపై ప్రియా భవానీ కనిపించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. కేదార్ శంకర్, దేవీ ప్రసాద్ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. పవిత్రా లోకేష్ అమ్మగా ఆకట్టుకుంది. సద్దాం, సప్తగిరి నవ్వించారు. సత్యం రాజేష్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment